
ఎస్బీఐ కేసును ఛేదించిన పోలీసులు?
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో గత నెల 23న అపహరణకు గురైన 20కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు పూర్తిస్థాయిలో రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు 10రోజుల వ్యవధిలోనే ప్రధాన నిందితునితోపాటు ఈ ఘటనలో భాగస్వామ్యమున్న మరో 46 మందిపై కేసు నమోదు చేశారు. 43మందిని రిమాండ్‌కు పంపించారు. గత నెల 31న 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ వెల్లడించిన విషయం తెలిసిందే. చెన్నూర్ ఎస్బీఐ కేసులో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు ఆధ్వర్యంలో రోజురోజుకూ పురోగతి సాధించారు. ఈ నెల 31నుంచి బంగారు నగల రికవరీని ప్రారంభించారు. వివిధ ఫైనాన్స్ కంపెనీలు, గోల్డ్‌లోన్ కంపెనీలు, ఫైనాన్స్ సంస్థల నుంచి 18కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గత మంగళవారం తెల్లవారుజామున చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లోని సేఫ్టీ లాకర్‌లో భద్రపరిచారు. ఈ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరించి గోల్డ్‌లోన్ బాధితులకు అడుగడుగునా భరోసానిస్తున్నారు. ఏక కాలంలో మంచిర్యాల మణప్పురం, ముత్తూట్ ఫిన్ క్రాప్‌ల నుంచి మరో రెండు కిలోల బంగారు ఆభరణాలు స్వాఽధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు పోలీసులు పూర్తిస్థాయిలో బంగారు నగలు రికవరీ చేసినట్లు తెలిసింది.
నేడు వివరాలు వెల్లడించనున్న పోలీసులు!
బంగారు ఆభరణాల రికవరీ విషయాన్ని గురువారం పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం. 20రోజులుగా ఆందోళనకు గురవుతున్నా గోల్డ్‌లోన్ బాధితులకు పూర్తి భరోసా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వివిధ ఫైనాన్స్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను త్వరగా కోర్టుకు అప్పగించి బ్యాంక్ ద్వారా బాధితులకు ఇచ్చేలా చర్యలు వేగవంతం చేసినట్లు సమాచారం. ఏదేమైనా రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఎస్బీఐ బ్రాంచ్ నుంచి బంగారు ఆభరణాల అపహరణ కేసును రామగుండం సీపీ ఆధ్వర్యంలో మంచిర్యాల డివిజన్ పోలీసులు అనతికాలంలో ఛేదించడం విశేషం.