
ఇన్సాస్ రైఫిల్ తస్కరించిన నేవీ కానిస్టేబుల్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ముంబయి క్రైం బ్రాంచ్ సోదాలు ఆయుధంతోపాటు 40తూటాలు, 3 మ్యాగ్జిన్లు స్వాధీనం
పెంచికల్‌పేట్(సిర్పూర్): ముంబయిలో ఓ నేవీ కానిస్టేబుల్ తస్కరించిన ఇన్సాస్ రైఫిల్‌ను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆ నగర క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన డుబ్బుల రాకేశ్ రెండేళ్ల క్రితం నేవీలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి ఫిబ్రవరి వరకు ముంబయిలో విధులు నిర్వర్తించాడు. ఇటీవల కేరళలోని ఎర్నాకుళంకు బదిలీపై వెళ్లాడు. కాగా, ఈ నెల 6న రాకేశ్ తన అన్న డుబ్బుల ఉమేశ్‌తో కలిసి ముంబయి నేవీ కేంద్రానికి వెళ్లాడు. సెంట్రీ స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్‌తోపాటు, 40 తూటాలు, మూడు మ్యాగ్జిన్లను వారు దొంగిలించారు. ఆయుధంతో ఇద్దరు సోదరులు స్వగ్రామం ఎల్కపల్లికి చేరుకున్నారు. నేవీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైం బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిందితులను మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయుధం, తూటాలు, మ్యాగ్జిన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ముంబయి క్రైం బ్రాంచ్‌కు సహకరించిన కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్‌పేట్ ఎస్సై అనిల్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారు. దేశ భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న యువకుడు పక్కా ప్రణాళిక ప్రకారం ఆయుధాన్ని దొంగలించి, సొంత గ్రామానికి తీసుకురావడంలో కుట్ర కోణం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.