
కేడర్‌ను కాపాడుకోవాలే!
డబ్బులు ఖర్చు చేస్తేనే నియోజకవర్గాల్లో పట్టు యూరియా బస్తాల నుంచి దసరా కానుకల దాక స్థానిక ఎన్నికల ముందు నాయకులకు కష్టాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జిల్లా నాయకులు అష్టకష్టాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు కార్యకర్తలు, ద్వితీ య శ్రేణి నాయకులు తమ చేయి జారకుండా చూ సుకుంటున్నారు. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ జిల్లా నాయకత్వానికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగానే మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని గత నెలలో ప్రకటనలు వెలువడిన సమయంలోనే ఎవరి దారి వారు చూసుకునే పని లో నిమగ్నమయ్యారు. కొందరైతే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతున్న కారణంగా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు జరిగే వరకు కేడర్‌ను కాపాడుకోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. తర్వాత పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాల్టీలు, సహకార సంఘాల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్ర మంలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవాల్సి ఉంది. ఎక్కడికక్కడ అసమ్మతి మొదలైతే ఇబ్బంది అవుతుందని ఆయా నాయకులను పలు రకాలుగా దగ్గర పెట్టుకుంటున్నారు.
పండుగల వేళ సతమతం
ఇటీవల వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు ప్రజాప్రతినిధులతోపాటు నాయకులను ఎంతో కొంత చందా రూపంలో ఇవ్వమంటూ వేడుకున్నారు. జిల్లాస్థాయి నాయకులతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా, మండల స్థాయి నాయకులు తమకు తోచినంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ అనుచర వర్గం అసంతృప్తితో ఇబ్బంది పడాల్సి వస్తుందని తప్పని పరిస్థితుల్లో ఆయా మండపాల వద్ద పలు రకాలుగా సాయం అందించారు. ఇక బతుకమ్మ, దసరా పండుగ ముందు కూడా నాయకుల నుంచి కానుకలు ఆశిస్తున్నారు. నమ్మి వెంట తిరుగుతున్న నాయకులు తమకు ఏదైనా ఇస్తారనే ఆశతో ఉన్నారు. ఏటా పండుగ పూట మద్యం, మాంసం కోసం కార్యకర్తలకు డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం కాస్త నగదు కూడా ఇస్తారనే ప్రచారం మొదలైంది. ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46మంది ఎంపిక చేసిన కార్యకర్తల శ్రమను గుర్తించి రూ.20వేల చొప్పున నగదు పంపిణీ చేయడంతో మిగతా కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. ఇక పండుగ వరకు ఇంకా కానుకలు అనేక మందికి పంచాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల దాకా కేడర్‌ను కాపాడుకోవడమే నియోజకవర్గ బాధ్యులకు ప్రధాన కర్తవ్యంగా మారింది.
అంతర్గతంగా అసంతృప్తి
అధికార పార్టీలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారితోపాటు పార్టీ పదవులు, వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, చైర్మన్లు, కార్పొరేటర్, మేయర్ వరకు పోటీలో దిగాలని అనేకమంది ఆశావహులు క్యూలో ఉన్నారు. ఇప్పటికే తాము బరిలో ఉంటామని పలు కార్యక్రమాలు చేపడుతూ ఆసక్తిని వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల వద్ద పోటీలో ఉంటామని తెలియజేస్తున్నారు. దీంతో ఎక్కడ అసంతృప్తి వచ్చినా ఇబ్బంది అవుతుందని జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది. ప్రస్తుతం యూరియా బస్తాలు తమకు దొరకడం లేదని నాయకులు వాపోతున్నారు. అధికార పార్టీ కార్యకర్తలతోపాటు ప్రతిపక్ష పార్టీ నాయకులకూ ఇదే ఇబ్బంది ఎదురవుతోంది. తమకు రెండు బస్తాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. స్టాక్ లేకపోవడం, సకాలంలో బస్తాలు ఇవ్వకపోతే రైతు కుటుంబాల నుంచి వ్యతిరేకత వస్తుందని కిందా మీద పడుతూ ఒత్తిడి అధికంగా ఉన్న చోట్ల పంపిణీ చేయిస్తున్నారు.