
యూరియా కోసం అన్నదాతల అరిగోస
కోటపల్లి: మండలంలోని సిర్సా గ్రామంలో యూరియా పంపిణీ రసాభాసగా మారింది. వివరాలు.. గ్రామంలో మంగళవారం యూరి యా పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు. ముందుగా బస్తాలను ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లో డంప్ చేయగా మరో వర్గంవారు దీనిని వ్యతిరేకించారు. దీనిపై పరస్పరం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామానికి డీఏవో సురేఖ వచ్చి అధికారులతో మాట్లాడుతుండగా.. రెండు వర్గాల వారు సమస్య చెప్పుకొన్నారు. ఈ క్రమంలో వాగ్వాదానికి దిగారు. యూరియాను ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో ఎలా డంప్ చేస్తారని ప్రశ్నించారు. బస్తాలు డంప్ చేసిన ఇళ్ల ముందు నిరసనకు దిగారు. వెంటనే అక్కడికి ఎస్సై రాజేందర్ చేరుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. అధికారులను అక్కడి నుంచి పంపించి యూరియా పంపిణీ సజావుగా సాగేలా చూశారు.