
సర్దుబాటు మరోసారి..!
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్ పేరిట సర్దుబాటు చేస్తోంది. ఇదివరకు 99మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది. ఇటీవల ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టడంతో ఆయా పాఠశాలల్లో ఖాళీలేర్పడ్డాయి. జిల్లాలో 27మంది ఎస్‌ఏలు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా, 70 మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారు. పలువురు టీచర్లు రిటైర్డ్ కాగా, ఆయా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. చదువులపై ప్రభావం పడకుండా ఇప్పటికే ఎక్కడెక్కడా ఖాళీలున్నాయో గుర్తించారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయుల్లోని ఎస్జీటీలు, స్కూల్ అసిసెంట్లను సర్దుబాటు చేశారు. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వర్క్ అడ్జస్ట్ మెంట్‌తో సమీప పాఠశాలల నుంచి 55 మందిని సర్దుబాటు చేస్తూ మంగళవారం డీఈవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
బోధనపై ప్రభావం పడకుండా..
బోధనపై ప్రభావం పడకుండా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. 37మంది ఎస్జీటీలు, ఒక ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌ను డిప్యూటేషన్ చేశారు. సబ్జెక్టుల కొరత అధిగమించేందుకు 17మంది స్కూల్ అసిస్టెంట్లకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేశారు. ఇందులో ఆరుగురు తెలుగు టీచర్లు, ముగ్గురు బయోసైన్స్, ఇద్దరు ఫిజికల్ సైన్స్, ఇద్దరు సోషల్, ఒకరు ఇంగ్లిష్ , హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేశారు.
జిల్లా సమాచారం