
కుక్కల దాడి కేసులో స్టేట్‌మెంట్ రికార్డు
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ నెల 5న చొప్పరి అక్షిత అనే ఐదేళ్ల చిన్నారిపై కుక్కలు దాడిచేసిన ఘటనపై మంగళవారం బెల్లంపల్లి కోర్టు జడ్జి ముఖేశ్ విచారణ చేపట్టారు. ఈ ఘటనను సుమోటో కేసుగా పరిగణించి కలెక్టర్, మండల పంచాయతీ అధికారి, ము త్యంపల్లి పంచాయతీ కార్యదర్శికి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చిన్నారి ఇంటికి వెళ్లిన జడ్జి ఘటనకు సంబంధించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. దాడి విషయమై చిన్నా రి అక్షిత తల్లితో పాటు స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకుని నమోదు చేశారు. చిన్నారి శరీరం, తల కు తీవ్రగాయాలైన విషయాన్ని తల్లి వివరించింది. జడ్జిని చూడగానే ఆమె విలపించిన తీరు అందరినీ కలచివేసింది. కుక్కల దాడి ఘటనపై లీగల్ సర్వీసెస్ కమిటీ పేర్కొన్నట్లు ఎంపీవో సబ్దార్ అలీ, కార్యదర్శి మేఘన కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేందుకు గడువు కోరడంతో సెప్టెంబర్ 12వరకు పూర్తి వివరాలతో హాజరుకావాలని కోర్టు సూచించినట్లు సమాచారం. స్థానికులు స్పందించి చిన్నారి ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం జమ చేసిన రూ.34వేల నగదును జడ్జి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. కాసిపేట ఎస్సై ఆంజనేయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అబ్దుల్ కలీల్, ఉపాధ్యాయుడు నాగమల్లయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.