
గంజాయి సాగు చేస్తున్న ఒకరి రిమాండ్
లింగాపూర్: గంజాయి సాగు చేస్తున్న ఒకరిని రిమాండ్‌కు తరలించినట్లు జైనూర్ సీఐ రమేశ్, లింగాపూర్ ఎస్సై గంగన్న తెలిపారు. లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ మహెబూబ్ తన పంటచేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లి తనిఖీ చేయగా 24 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
దాడి కేసులో
ముగ్గురు..
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్‌కు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. కాలనీకి చెందిన అక్షయ్‌కుమార్ అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమపేరుతో వేధిస్తుండగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల తరువాత కేసులో రాజీ పడాలని నిందితుడు యువతిని బెదిరించడంతో మళ్లీ ఫిర్యాదు చేసింది. సోమవారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు తండ్రి రవీందర్‌పై నిందితుడు అతని సోదరులు సంజయ్, విజయ్‌లతో కలిసి దాడికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.
అడ్వకేట్‌పై దాడిచేసిన
మహిళపై కేసు
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీసు స్టేషన్ పరిధిలోని కేఆర్‌కే కాలనీలో అడ్వకేట్‌పై దాడిచేసిన మహిళపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కర్రె స్వామి తెలిపారు. కేఆర్‌కే కాలనీకి చెందిన మహిళకు నాన్ బెయిలెబుల్ నోటీసు అందజేయడానికి అడ్వకేట్ కమిషన్ ఠాకూర్ కౌషిక్ వెళ్లడంతో ఆయనపై సదరు మహిళ దాడికి పాల్పడింది. దీంతో కౌషిక్ ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
అయ్యప్ప ఆలయంలో చోరీ
తలమడుగు: మండలంలోని సుంకిడి అయ్య ప్ప ఆలయంలో చోరీ జరిగినట్లు ఇన్‌చార్జీ ఎస్సై జీవన్ రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి హుండీని పగులగొట్టి రూ.20వేల నగదు, రూ.50వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగలించారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా అయ్యప్ప ఆలయంలో చోరీ జరగడం ఇది మూడవసారి.
సైబర్ వలలో నిరుద్యోగి
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఓ నిరుద్యోగి సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కాడు. తన వాట్సాప్‌కు ఏప్రిల్ నెలలో హాయ్ అంటూ మెస్సేజ్ వచ్చింది. జాబ్ ఆఫర్స్ ఉన్నాయని తెలుపడంతో స్పందించాడు. ఆన్‌లైన్‌లో మొదట రూ.5వేలు పంపించాల్సి ఉంటుందని, ఇంటి వద్ద నుంచే పని చేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి వేతనం చెల్లించడం జరుగుతుందని సూచించారు. మొత్తం ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.98వేలు ఆన్‌లైన్‌లో సదరు యువకుడు చెల్లించినా ఎలాంటి ఉద్యోగం కల్పించలేదు. తీరా మోసపోయానని తెలియడంతో మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
నాందేడ్ ఇంటర్‌సిటీ
ఎక్స్‌ప్రెస్ ఆలస్యం
ఆదిలాబాద్: దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ రైల్వే డివిజన్ విభాగంలో జరుగనున్న లైన్ బ్లాక్ పనుల కారణంగా ఆదిలాబాద్–హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (17409) రైలు కొంత ఆలస్యంగా నడవనున్నట్లు నాందేడ్ రైల్వే డివిజన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 15న మాల్‌టెక్డీ స్టేషన్ వద్ద 80 నిమిషాల పాటు, 17, 18 తేదీల్లో లింబగావ్ స్టేషన్ వద్ద 40 నిమిషాల పాటు, 24, 25, 26 తేదీల్లో బోల్డా స్టేషన్ వద్ద 30 నిమిషాల పాటు నిలిపివేయబడుతుందని వివరించింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకో వాలని విజ్ఞప్తి చేసింది.
సంస్కృతి, సంప్రదాయాలపై టీచర్ల ప్రదర్శన
నిర్మల్‌ఖిల్లా: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ప్రదర్శనలో ‘బోధనాభ్యసన ప్రక్రియలో పప్పెట్రీ (తో లుబొమ్మలాట)’ అనే అంశంపై 15 రోజులపా టు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. 13 రా ష్ట్రాల నుంచి 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. రాష్ట్రం నుంచి పది మంది ఉపాధ్యాయులు భాగస్వామ్యమవుతుండగా నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్‌పాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన మాదరి ఎల్లన్న పాల్గొన్నారు. మంగళవారం వివిధ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేపట్టిన వీరి ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.