
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు..
సోన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కడ్తాల్ గ్రామానికి చెందిన డీకొండ ప్రసాద్ (40) సోమవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని ముఠాపూర్‌లో గణేశ్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నాడు. మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగివస్తుండగా కడ్తాల్ గ్రామ శివారులోని హరిత రిసార్ట్ వద్ద 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గోపి తెలిపారు.
నీటిగుంతలో పడి వృద్ధుడు..
నెన్నెల: నీటిగుంతలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మారమ్మ వాడకు చెందిన జంబి చీకటి (74) సోమవారం ఉదయం నెన్నెల శివారులోని పత్తి చేనుకు కాపలా వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య పోసాని, కుమారుడు మల్లేశ్ వెతుకుతుండగా రోడ్డుపక్కన నీటిగుంతలో పడి మృతి చెంది కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
చెరువులో పడి ఒకరు..
భైంసారూరల్: ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒక రు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కోతల్‌గాం గ్రామానికి చెందిన చిట్టెల్‌వార్ గంగారాం(64)సోమవారం ఉదయం పశువులు మేపేందుకు గ్రామ సమీపంలోకి వెళ్లాడు. పక్కనే ఉన్న చెరువులో పశువులు దిగడంతో వాటిని ఒడ్డుకు చేర్చేక్రమంలో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆచూకీ కోసం గాలించారు. మంగళవారం ఉదయం మృతదేహం నీటిపై తేలియాడడంతో పో స్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భారత్‌బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
లారీ ఢీకొని యువకుడు..
లక్ష్మణచాంద: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కనకాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మామడ మండలంలోని నల్తూర్థికి చెందిన కొత్తపెల్లి ఉదయ్ కుమార్(23) కొంతకాలంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు వద్ద పనిచేస్తున్నాడు. మంగళవారం పనినిమిత్తం నల్తూర్థికి వెళ్లి నిర్మల్‌కు బైక్‌పై వస్తుండగా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్‌వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బావ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
వివాహిత అదృశ్యం
ఆదిలాబాద్‌టౌన్: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన దంపతులు ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య మనస్పర్థాలు రావడంతో మంగళవారం ఉదయం చౌహాన్ పూజ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె భర్త చౌహాన్ రాజేష్ టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఏటీఎం సెంటర్‌లో ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఒరిస్సాలోని బలేశ్వర్‌కు చెందిన బిప్లబ్ కుమార్ సోమవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని కిసాన్ చౌక్ ప్రాంతంలోని డీబీఎస్ ఏటీఎంలోకి చొరబడ్డాడు. గడ్డపారతో యంత్రాన్ని ధ్వంసం చేసి లాకర్‌ను పగులగొట్టేందుకు యత్నించాడు. ఆ సమయంలో అలారం మోగడంతో అక్కడి నుంచి పరుగులు పె ట్టాడు. అప్రమత్తమైన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిని రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. చోరీకి యత్నించిన వీడియోలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. కాగా నిందితుడు వారం రోజుల క్రితం జిల్లా కేంద్రానికి రైలులో వచ్చినట్లు పేర్కొన్నారు. చోరీకి యత్నించగా పట్టుబడినట్లు సీఐ నాగరాజు వివరించారు.