
ఉప్పొంగిన వాగు.. నిలిచిన రాకపోకలు
సాత్నాల: భోరజ్ మండలం తర్నం వాగు మంగళవా రం పొంగి పొర్లడంతో జాతీయ రహదారి 353 బిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోకిలోమీటర్ల మేర, ట్రాఫిక్ జామ్‌అయింది. వాగులో నీరు తగ్గకపోవడంతో వందలాది మందిగంటలతరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రూ.4.5 కోట్ల తో నిర్మించిన లోలెవల్ వంతెన ఉపయోగంలో లే కుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు.
గణేశ్ చందా కాజేసిన
వ్యక్తులపై ఫిర్యాదు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పాత గర్మిళ్ల హన్మన్ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన గణేశ్ నవరాత్రుల ఉత్సవాల కోసం వసూల్ చేసిన చందా డబ్బులను కొందరు వ్యక్తులు కాజేశారని కమిటీ సభ్యుల్లో కొందరు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగ వెలుగులోకి వచ్చింది. కమిటీ సభ్యుల కథనం మేరకు ఎనిమిదేళ్లుగా వినాయకుడిని ప్రతిష్టిస్తుండగా ఏటా చందారూపంలో వచ్చిన డబ్బులు సుమారు రూ.10 లక్షల వరకు జమయ్యాయి. వీటికి సంబంధించిన లెక్కలు చెప్పాలని కమిటీ ప్రధాన సభ్యులను కోరగా చెప్పకుండా బెదిరింపులకు పాల్పడడంతో రామల్ల వెంకట్‌రెడ్డి, ఆకెనపెల్లి మధు, ఎగ్గెన శ్రీధర్, పుప్పాల హరిష్‌పై కమిటీ సభ్యులు రాములు, రవి, అశోక్, స్వామి, మరి కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఏఎస్సై వెంకన్నగౌడ్‌ను వివరణ కోరగ ఫిర్యాదు అందింది వాస్తవమేనని, ఇరు వర్గాల వారిని విచారించనున్నట్లు తెలిపారు.
‘3న దసరా సెలవు ఇవ్వాలి’
శ్రీరాంపూర్: అక్టోబర్ 3న దసరా సెలవు ఇవ్వాలని కోరుతూ హెచ్‌ఎంఎస్ నాయకులు మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్ డీజీఎం(ఈఅండ్‌ఎం) రవీందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉందని, అదే రోజున దసరా పండుగ వచ్చిందన్నారు. కంపెనీ అక్టోబర్ 2న దసరా పండుగను గుర్తించడం వలన కార్మికులు పండుగ జరుపుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. డబ్యూసీఎల్ సంస్థలో దీన్ని మార్పు చేశారని సింగరేణిలో కూడా 3న దసరా సెలవుగా ప్రకటించాలని కోరారు.
గోదావరిలో వివాహిత గల్లంతు..
దండేపల్లి: మండలంలోని గూడెం గోదావరి నదిలో కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం తలండి గ్రామానికి చెందిన వివాహిత పోలోజు శృతి(42) గల్లంతైనట్లు పోలీసులు, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా శృతి మానసిక స్థితి బాగోలేదు. మంగళవారం పనిమీద బయటకు వెళ్లిన ఆమె భర్త వెంకటేష్ కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లగా శృతి కనిపించలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా గూడెం గోదావరి వంతెన వద్ద బ్యాగు, చెప్పులు కనిపించాయి. నదిలో దూకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
దహెగాం: ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలించి రైస్‌మిల్లు వద్ద అన్‌లోడ్ చేస్తుండగా సోమవారం రాత్రి ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు రాజ్‌కుమార్, శ్రీనివాస్ పట్టుకున్నట్లు తహసీల్దార్ మునవార్ షరీఫ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్కాపూర్‌కు చెందిన వ్యాన్‌లో కన్నెపల్లి నుంచి 54 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలించి దహెగాంలోని వాసవి మోడ్రన్ రైస్ మిల్లులో అన్‌లోడ్ చేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బియ్యానికి పంచనామా నిర్వహించి దహెగాం రేషన్ దుకాణం–1కు అప్పగించినట్లు తెలిపారు. రైస్‌మిల్లు యాజమాని సూర సందీప్, గుమస్తా విఘ్నేష్, వ్యాన్ యాజమాని రాకేశ్, డ్రైవర్ అభిషేక్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం పులిమడుగులోని హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్‌లో మంగళవారం అండర్–14, 17 జిల్లా స్థాయి బాల బాలికల ఫుట్‌బాల్ ఎంపిక పోటీలను మందమర్రి సీఐ శిశధర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, పరిశీలకులు పాల్గొన్నారు.