
నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి
మందమర్రిరూరల్: సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో సోమవారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యార్థులతో కలిసి పాలచెట్టు వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా లయన్స్ క్లబ్ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, మండల విద్యాధికారి దత్తుమూర్తి, డీఆర్‌పీ జనార్దన్, శాంకరి, సుమన్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.