యూరియా కోసం రైతుల ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రైతుల ఆందోళనలు

Sep 9 2025 1:12 PM | Updated on Sep 9 2025 2:24 PM

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: యూరియా కష్టాలు తీరడం లేదు. రైతులు పెద్దయెత్తున బారులు తీరుతూనే ఉన్నారు. సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో జిల్లాలో ఉదయం నుంచే కర్షకులు ఎరువుల కోసం వరుసలో నిల్చుని ఎదురు చూస్తున్నారు. జిల్లాకు కేటాయించిన కోటా కంటే ఈ సీజన్‌లో అధికంగానే సరఫరా జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం యూరియా సరఫరాపై ఎప్పటికప్పుడు సీరియస్‌గా తీసుకుని జిల్లా అధికారుల నుంచి నివేదికలు, పరిస్థితిని తెలుసుకుంటోంది. జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం ఎరువులు సరఫరా చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు. 

అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం లక్సెట్టిపేట, దండేపల్లి, చెన్నూర్‌, భీమారం, కోటపల్లి మండలాల్లో రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. చెన్నూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, లక్సెట్టిపేట మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. వ్యవసాయ అధికారులు సరఫరా, పంపిణీలో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం చేసుకోకపోవడంపై జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సీరియస్‌ అయ్యారు. ఇటీవలే బదిలీపై వచ్చిన జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరెండర్‌ చేస్తానని హెచ్చరించారు. చివరకు ఆయన దీర్ఘ కాలిక సెలవులో వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

డిమాండ్‌ పెరిగి..

ఏటేటా యూరియా కోసం డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. పంటల సాగులో రసాయన ఎరువులపైనే పూర్తిగా ఆధారంగా పంటలు సాగవుతున్నాయి. వరి, పత్తి ఎదుగుదల, మొక్క బలంగా ఉండేందుకు ఈ ఎరువును బస్తాల కొద్దీ వాడుతున్నారు. జిల్లా కోటా ప్రకారం ఈ సీజన్‌లో 28వేల మెట్రిక్‌ టన్నులు అవసరం. ఇప్పటికే 21వేల వరకు సరఫరా జరిగింది. మరో 7వేల మెట్రిక్‌ టన్నుల సరఫరా చేయాలి. గతేడాదితో సరఫరా 20వేల మెట్రిక్‌ టన్నులతో పోలిస్తే, ఈ ఏడాది అధికంగా సరఫరా జరిగింది. అయినప్పటికీ వినియోగం పెరగడంతో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. పోలీసుల జోక్యంతో పంపిణీ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించి సరఫరా చేసేలా చొరవ తీసుకుంటున్నారు. యూరియా సరఫరా పంపణీలో వ్యత్యాసం, రైతుల నుంచి విపరీత డిమాండ్‌తో స్టాక్‌ వచ్చినప్పటికీ సరిపోవడం లేదు.

అత్యధికంగా బెల్లంపల్లి పరిధిలో..

జిల్లాలో సోమవారం ఒక్క రోజే హోల్‌సేల్‌, రిటైల్‌, సొసైటీలు, మార్క్‌ఫెడ్‌, కంపెనీ గోదాంలు గుండా మొత్తం 863.24మెట్రిక్‌ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. మొత్తంగా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలో బెల్లంపల్లిలో అధికంగా 9379మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగం కాగా, చెన్నూరు 8096మెట్రిక్‌ టన్నులు, మంచిర్యాల 2686మెట్రిక్‌ టన్నులు, ఖానాపూర్‌(జన్నారం మండలం) 576మెట్రిక్‌ టన్నుల సరఫరా వినియోగం జరిగింది.

సెలవుపై వెళ్లిన వ్యవసాయాధికారి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లా వ్యవసాయ అధి కారి(డీఏవో) ఛత్రునాయక్‌ మంగళవారం నుంచి సెలవులో వెళ్తున్నారు. ఓ వైపు జిల్లాలో తీవ్రమైన యూరి యా కొరత నెలకొన్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ సమయంలో డీఏవో సెలవుపై వెళ్లడంతో ఆంతర్యమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. పంటలకు కీలకమైన సమయంలో సెలవులో వెళ్లడం కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాగుకు అనుగుణంగా మండలాలకు యూ రియా పంపిణీ సక్రమంగా చేపట్టకపోవడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోవడం, రైతుల ఆందోళనలు నియంత్రించకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సరెండర్‌ చేయాల్సి వస్తుంది.. దీర్ఘకాలిక సెలవులో వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, డీఏవో గత జూలై 17న బాధ్యతలు స్వీకరించారు. నెల ఇరవై రోజుల వ్యవధిలోనే సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో భీమిని ఏడీఏ సురేఖకు ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.

ఐదు రోజుల నుంచి..

మూడు బస్తాల యూరియా బస్తాల కోసం గత ఐదు రోజుల నుంచి చెన్నూర్‌కు వచ్చి పోతున్నా. నేడు, రేపు అంటూ అధికారులు తిప్పించుకుంటున్నారు. ఒక్క బస్తా ఇచ్చింది లేదు. రైతుల గోస పట్టించున్న నాథుడే లేరు. పొద్దున ఎరువుల గోదాంకు వచ్చి సాయంత్రం వరకు ఉన్నా తలుపు తీసింది లేదు. అధికారులు వచ్చింది లేదు. మా గోస దేవునికి ముడుతుంది.

– రైతు బొరెం రామయ్య, గ్రామం: అంగ్రాజుపల్లి, మం: చెన్నూర్‌

ఎన్నడూ ఇంత గోస పడలే..

గత నాలుగేళ్లు ఎన్నడూ ఎరువుల కోసం ఇంత గోస పడలే. నాలుగు రోజుల నుంచి ఎరువుల కోసం తిరుగుతున్నా. పొద్దున వచ్చి రాత్రి వరకు ఉంటే ఒక్క బస్తా దొరకడం లేదు. ఇయ్యాలన్న ఎరువులు ఇస్తారాని అనుకుంటే రేపు రమ్మంటున్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి రైతులకు సరిపడా ఎరువులు ఇచ్చేలా చూడాలి.

– కావెరి రజిత, మహిళా రైతు,  గ్రామం: తుర్కపల్లి, మం: చెన్నూర్‌

జిల్లాలో వానాకాలంలో సాగు(ఎకరాల్లో)

వరి 1,47,447

పత్తి 1,61,003

మొక్కజొన్న 255

పప్పుధాన్యాలు 1,117

ఇతర పంటలు 572

మొత్తం 3,10,394

జిల్లాలో యూరియా లెక్కలు

అవసరం 28,000

సరఫరా 20,800

ఇంకా రావాల్సింది 7,361

వినియోగం 20,639

నిల్వ 191.57

గతేడు ఈ సమయానికి సరఫరా 20,739.27

(నోట్‌: వివరాలు ఈ నెల 5వరకు, విలువ మెట్రిక్‌ టన్నుల్లో)

 రైతుల ఆందోళనలు1
1/1

యూరియా కోసం రైతుల ఆందోళనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement