
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్, పరిహారం, తదితర సమస్యలపై పలువురు ఫిర్యాదులు అందజేశారు. తెలంగాణ ఎరుకుల ప్రజాసమితి జిల్లా అధ్యక్షుడు ఉండ్రాల ఎల్లయ్య జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కొడుకులు పట్టించుకోవడం లేదని మంచిర్యాల కాలేజీ రోడ్‌కు చెందిన రిటైర్డు టీచర్ బజ్జూరి వెంకటయ్య వినతిపత్రం అందజేశారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధి బోట్లకుంటచెరువు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలపై బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఫిర్యా దు చేశారు. వెంటనే అర్జీలను పరిశీలించి పరిష్క రించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.