
తెరుచుకున్న బాసర ఆలయం
బాసర: రాహుగ్రస్త చంద్రగ్రహణం అనంతరం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరిచారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి గణపతి పూజ, పుణ్యహావచనం, పంచగవ్య ప్రాశన, మహాసంప్రోక్షణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, విశేష అభిషేకం, మహా నివేదన, మంత్రపుష్పం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు అన్ని అర్జిత సేవలు, సర్వ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
11న ఇన్‌చార్జి మంత్రి జూపల్లి పర్యటన
కై లాస్‌నగర్: రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 11న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం నిర్మల్ నుంచి బోథ్‌కు చేరుకుని ఇందిరమ్మ మోడల్ ఇంటిని ప్రారంభిస్తారు. పరిచయ గార్డెన్‌లో వివిధ సంక్షేమ పథకాల కింద ఎంపికై న నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. ఇంద్రవెల్లికి చేరుకుని అమరవీరుల స్థూపాన్ని ప్రారంభిస్తారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. మధ్యాహ్నం భోరజ్ మండలం పిప్పర్‌వాడకు చేరుకుని ఇందిరమ్మ గృహాప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి గిమ్మకు చేరుకుని రూ.13.78 కోట్ల సీఆర్‌ఆర్, ఎస్‌సీపీ నిధులతో చేపట్టనున్న సీసీరోడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు. పట్టణంలోని గాయత్రీ గార్డెన్‌లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
సినీ ఫక్కీలో దాడికి యత్నం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో కొందరు యువకులు సినీఫక్కీలో దాడి చేసేందుకు యత్నించారు. బాధితులు పారిపోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఈనెల 6న ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపూరకు చెందిన గణేశ్ మండలి సభ్యులు గ్రూప్‌గా విడిపోయి పరస్పరం దాడికి పాల్పడ్డారు. సోమవారం కోలిపూరకు చెందిన ఆకుల నితీష్ అలియాస్ టిక్కు, కారింగుల సాయికిరణ్, పరివార్ మణికంఠ అదే కాలనీకి చెందిన కళ్యాణ్, మురార్కర్ నవీన్, కార్తీక్‌తో పాటు పలువురిపై దాడి చేసేందుకు సింహాద్రి సినిమాలో మాదిరి సైకిల్ గేర్‌విల్‌తో తయారు చేసిన ఆయుధంతో వెళ్లారు. గమనించిన బాధితులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఆ తర్వాత వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో మురార్కర్ నవీన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కారింగుల సాయికిరణ్, పరివార్ మణికంఠలను అరెస్టు చేయగా ఆకుల నితీన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఆయుధాన్ని తయారు చేసిన వ్యక్తిపై సైతం కేసు నమోదు చేసినట్లు వివరించారు.