
‘మీన’మేషాలు!
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో చేపపిల్లల విడుదలపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గత ఏడాది చేపపిల్లలు సరఫరా చేయకపోగా.. ఈ ఏడాది ఇంకా టెండర్లలో జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం చేపపిల్లలు సరఫరా చేస్తుందో లేదోనని కొందరు మత్స్యకారులు తలా కొంత నగదు పోగు చేసి చేపపిల్లలు కొని చెరువులు, కుంటల్లో వదులుతున్నారు. ఒక్కో చేపపిల్ల ల ప్యాకెట్ రూ.200 కాగా.. ఒక్కోదాంట్లో వంద నుంచి రెండు వందల పిల్లలు ఉంటున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి మత్తడి దూకాయి. జిల్లాలో 132 మత్స్యకార సంఘాలు ఉండగా.. 7,468 మంది పురుష, మహిళా సభ్యులు ఉన్నారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నీటి వసతి కలిగిన చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు వదిలేందుకు గత జూలైలో ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది 363 చెరువులు, కుంటలు, 9 చిన్న, పెద్ద ప్రాజెక్టుల్లో మొత్తం 2.18 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయాలని మత్స్యశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 35 నుంచి 45ఎంఎం పరిమాణం గల చేపపిల్లలు 1.28 కోట్లు, 80నుంచి 100 ఎంఎం పరిమాణం గలవి 90లక్షలు జలాశయాల్లో వదిలేందుకు ప్రణాళిక రూపొందించారు. రహు, బొచ్చ, మిృగాల వంటి చేపపిల్లల ద్వారా 11.459 టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. కానీ ఇప్పటికీ చేపపిల్లల పంపిణీ ఊసే లేకపోవడంతో మత్స్యకారులు కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో వేసుకుంటున్నారు. ఇప్పటికే చేపపిల్లలు వదిలితే వేసవి కాలం నాటికి మంచి పరిమాణంలో ఎదిగి మత్స్యకారులకు మేలు జరిగేదని వాపోతున్నారు.
అదును దాటితే..
గతంలో చేపపిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఎదుగుదల లేక మత్స్యకారులకు పెద్దయెత్తున నష్టం వాటిల్లింది. నాణ్యత, పరిమాణం లేనివి వదిలారని, ప్రజాధనం దుర్వినియోగమైందని విమర్శలు వచ్చాయి. అదును దాటితే జలాశయాల్లో నీరు తగ్గడం, ఆహారం లభించకపోవడం, వాతావరణ మార్పులతో ఆక్సిజన్ లభించక ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదముంది.
నీరుగారిన లక్ష్యం..
గత ఏడాది 2.20లక్షల మెట్రిక్ టన్నుల చేపపిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాని లక్ష్యంలో 20శాతం కూడా వదలలేదు. ఈసారి టెండర్ల ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు. టెండర్‌దారులకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో చేపపిల్లల సరఫరాకు వెనుకంజ వేస్తున్నారు. గత వారం రోజులుగా ఎవరూ ముందుకు రాకపోవడంతో గత నెల 31వరకు విధించిన గడువును మరోసారి ఈ నెల 8వరకు పొడగించారు. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.