
సింగరేణి పరిరక్షణకు కలిసిరావాలి
శ్రీరాంపూర్: సింగరేణిని పరిరక్షించుకోవడానికి కార్మికులంతా కలిసి రావాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. శనివారం నస్పూర్ కాలనీలోని గోదావరి ఫంక్షన్ హాల్‌లో హెచ్‌ఎంఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభలు ప్రారంభమయ్యాయి. యూనియన్ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనులు రాకపోవడం వల్ల సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. నూతన గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉంటుందని, దీని కోసం కార్మికవర్గం పోరాడాలన్నారు. కార్మికుల హక్కుల సాధనకోసం తెలంగాణ జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేస్తున్నామన్నారు. కవితను యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా నియమించుకోబోతున్నట్లు తెలిపారు. ఆదివారం జరిగే సభలో నూతన కమిటీ ఎన్నికలు, పలు తీర్మాణాలు చేస్తామన్నారు. సమావేశంలో యూనియన్ సింగరేణి విభాగం అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గడిపల్లి కృష్ణప్రసాద్, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కార్యదర్శి పొనగంటి అశోక్, 12 ఏరియాల ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.