
ఆగస్టులో అతలాకుతలం
ఒక్కటే నెలలో 30శాతం అధిక వర్షం లోటు నుంచి సాధారణానికి వర్షపాతం మత్తడి దూకిన చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
మంచిర్యాలఅగ్రికల్చర్: ఆగస్టు నెల వర్షాలు జిల్లా ను అతలాకుతలం చేశాయి. రెండు నెలల లోటు వర్షపాతాన్ని ఒక్కటే నెలలో కురిసిన భారీ వర్షాలు సాధారణ స్థాయికి చేర్చాయి. ఎడతెరిపి లేని వర్షాల కు వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు మత్తడి దూకాయి. పంట పొలాలు చెరువులను తలపించాయి. వేల ఎకరా ల్లో పత్తి, వరి, కంది పంటలు నీటమునిగాయి. ఇసు క మేటలు వేయడంతోపాటు కోతకు గురయ్యాయి. రోడ్లు కోతకు గురి కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలమట్టం కావడంతో విద్యుత్ శాఖకు రూ.65లక్షల వరకు నష్టం వాటిల్లింది. సింగరేణి ప్రాంతం శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి పరిధిలోని ఓపెన్‌కాస్టుల్లో వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి రూ.కోట్లలో నష్టం ఏర్పడింది. జిల్లా సాధారణ వర్షపాతం 775.1 మిల్లీమీటర్లు కాగా 782.3మిల్లీమీటర్లు నమోదైంది. భీమారం, చెన్నూర్ మండలాల్లో 27 నుంచి 32 శాతం లోటు నెలకొంది. నాలుగు మండలాల్లో 30 నుంచి 50 శాతం అధికంగా కురువగా 12 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. జిల్లాలో భూగర్భజలాలు సైతం పెరిగాయి. జూన్ నెలలో 7.25 మీటర్ల లోతుకు ఉండగా ఆగస్టులో 4.50 మీటర్లకు వచ్చాయి.
వరద గోదావరి
నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్ రెండో వారంలో జిల్లాను తాకాయి. ఆగస్టు రెండో వారంలో భారీ వర్షాలకు చెరువులు మత్తడి దూకడంతోపాటు కొన్నింటికి గండ్లు పడ్డాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో 40గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. గొల్లవాగు, ర్యాలీవాగు, నీల్వాయి ప్రాజెక్టులు మత్తడి దూకాయి.
పెరిగిన సాగు..
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో సాగు విస్తీర్ణం జోరందుకుంది. ఖరీఫ్ సాగు అంచనా 3.31 లక్షల ఎకరాలు కాగా జూన్‌లో తొలకరి వర్షాలు పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలు విత్తుకోగా వరిసాగుకు వెనుకడుగు వేశారు. జూలై వరకు సాగు అంచనాలో సగం కూడా కాలేదు. ఆలస్యంగా ఆగస్టులో భారీ వర్షాలకు వరినారు పోసుకున్నారు. ఈ నెలలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో అంచనా మేరకు చేరుకుంది. ఇప్పటివరకు 3,11,321 ఎకరాల్లో పంటలు విత్తుకున్నారు. ఇంక వరి నాట్లు వేసుకుంటున్నారు.
జిల్లా వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
నెల కురువాల్సింది కురిసింది శాతం
జూన్ 160 96 40లోటు
జూలై 313.5 239.2 24లోటు
ఆగస్టు 287.3 372.4 30అధికం
రెండు నెలలు వర్షాల్లేక..
వానాకాలం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందస్తు వర్షాలు రైతులను మురిపించాయి. రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. రెండు నెలలు ఆశించిన వర్షాలు లేక చెరువులు, కుంటలు, జలాశయాలు బోసిపోయాయి. అడపాదడపా కురిసిన వర్షాలకు పంటలు సాగు చేయగా.. జూలైలో ఆశించిన వర్షాలు లేక వరినాట్లు వేయలేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నాట్లు వేశారు. విత్తుకున్న పంటలు వడలిపోయే దశకు చేరాయి. ఆగస్టు మొదటి వారం వరకు ఎండలు మండిపోయాయి. రెండో వారం 13నుంచి 20వరకు కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలతో జలాశయాల్లోకి వరద నీరు చేరడంతో నారు పోసుకుని నాట్లు వేశారు. అప్పటికే విత్తుకున్న పంటలకు ప్రాణం పోయగా.. వరి సాగుకు కలిసి వచ్చాయి. పది రోజులపాటు ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించగా జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరింది. వారం రోజుల్లోనే 227మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి పంటలకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆగస్టు నెలలో జిల్లాలోని 16 మండలాల్లో 9,083 మంది రైతులకు చెందిన 15,688.07 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.