వరద తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

వరద తగ్గుముఖం

Sep 3 2025 4:59 AM | Updated on Sep 3 2025 4:59 AM

వరద తగ్గుముఖం

వరద తగ్గుముఖం

గోదావరిలోకి నిలకడగా ఇన్‌ఫ్లో ‘ఎల్లంపల్లి’కి రికార్డు స్థాయిలో ప్రవాహం ఇప్పటివరకు 362టీఎంసీల నీరు ఈ నెలలో అధిక వర్షాలుంటే తిప్పలే..

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత వారం రోజులుగా గోదావరి వరద ఉధృతి పెరగడం తీర ప్రాంత ప్రజలను హడలెత్తించింది. ఎగువగన శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం, వర్షాలతో నదిలోకి వరద పోటెత్తింది. దీంతో లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా చేరింది. గత రెండ్రోజులుగా వర్షాలు తగ్గడంతో నది నిలకడగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇదే సమయంలో మరోవైపు ప్రాణహితలోనూ వరద తీవ్రత పెరిగింది. దీంతో తీర ప్రాంత రైతులు పంటలు నీట మునిగి ఇబ్బంది పడాల్సి వస్తోంది. మంచిర్యాల నగర పరిధిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం సమీపం వరకు వరద చేరింది. జిల్లా కేంద్రంలో ముంపు ప్రాంతమైన ఎన్టీఆర్‌ నగర్‌, రామ్‌నగర్‌, రాళ్లవాగు పరిసర ప్రాంతాల్లోకి నీరు చేరాయి. రెండు రోజులపాటు వరద రావడంతో ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత క్రమంగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే నైరుతి చివరలో సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఉంటాయి. మరోసారి అధిక వర్షాలు కురిస్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.

జిల్లాలో సాధారణ వర్షపాతమే

జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదవుతున్నప్పటికీ నదుల ప్రవాహం, ఎగువన కురిసే వర్షాలతో తీర ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతోంది. దీంతో సమీప ప్రాంతాలు, రైతుల పంటలు నష్టపోవాల్సి వస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 782.3మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం చూస్తే 775.1గా ఉంది. అంటే జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటికి సాధారణ వర్షమే కురిసింది. వారం రోజుల వరకు కొన్ని చోట్ల లోటు వర్షపాతమే నమోదైంది. అయితే గోదావరి ఎగువన ఉన్న నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్టులు, గోదావరి పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరదలు వస్తున్నాయి. దీంతో వానాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా కేంద్రం, పలు కాలనీలతోపాటు గోదావరి తీర ప్రాంతాలైన జైపూర్‌, చెన్నూరు, కోటపల్లి, ప్రాణహిత పరిధిలో ఉన్న వేమనపల్లి మండలాల్లోని ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

362.7టీఎంసీలు ఇన్‌ఫ్లో

వర్షాకాలం ఆరంభంలో తక్కువ నీటిమట్టంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వెలవెలబోయింది. ఆగస్టు రెండో వారం నుంచి క్రమంగా వర్షాలు కురవడంతో వరద రావడం మొదలైంది. మొ త్తం 20టీఎంసీల సామర్థ్యం కాగా, ప్రస్తుతం 17.78టీఎంసీలకు చేరుకోగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంకు మొత్తం 62వరద గేట్లు ఉన్నాయి. గరిష్టంగా 40గేట్లు ఎత్తి అత్యధికంగా ఇన్‌ఫ్లో ఉన్న సమయంలో 8.28లక్షల క్యూసెక్కుల దాకా నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లోను బట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 37గేట్లు ఎత్తి 3.86లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన గోదావరి పైనే నిర్మించిన సుందిళ్ల, అన్నారం గేట్లు సైతం పూర్తిగా ఎత్తి ఉండడంతో నదిలో ఎక్కడా నీటి నిల్వ లేకుండా మేడిగడ్డ నుంచి దిగువకు ప్రవహించింది. ప్రాజెక్టుల్లో బ్యాక్‌ వాటర్‌ లేకుండా వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోయింది. మొత్తంగా జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మొత్తం 362.7టీఎంసీల నీరు వచ్చి చేరింది. వీటిలో నంది పంపుహౌజ్‌ నుంచి 7టీఎంసీలు పోగా, మిగతా 357టీఎంసీల నీరు దిగువకే వరద గేట్ల ద్వారా వెళ్లింది. ఆ సమయంలో ఉధృతి అధికంగా ఉండడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement