
ముంచేస్తున్న వరద
నగరంలోని ముంపు కాలనీల్లో భయం భయం
ఇళ్లలోకి గోదావరి నది నీరు
నాలుగు రోజులుగా నిద్రలేని రాత్రుళ్లు
ప్రతియేటా వర్షాకాలంలో కష్టాలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని పలు కాలనీలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని గోదావరి నదిలోకి వదలడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 8లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 40గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి 8లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతుండడంతో మంచిర్యాల వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రం నుంచి ప్రవహించే రాళ్లవాగులోకి గోదావరి వరద నీరు వచ్చి చేరి సమీపంలోని కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఎన్టీఆర్‌నగర్ కాలనీ, రాంనగర్, పద్మశాలికాలనీ, ఆదిత్య ఎంక్లేవ్ ప్రాంతాలకు వరద నీరు చేరింది. గత నాలుగు రోజులుగా గోదావరి నదిలోకి వరద నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వదలడంతో ముంపు కాలనీల ప్రజలు నిద్రాహారాలు మానుకుని బిక్కు బిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా వర్షాకాలంలో వరద నీరు రాళ్లవాగుకు సమీపంలో ఉన్న కాలనీలను ముంచెత్తుతున్నాయి. రెండేళ్లు వరుసగా ఇళ్లు సైతం వరద నీటిలో మునిగాయి. గతేడాది ఇళ్లు మునగకపోవడంతో ముంపు కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు లేకున్నా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో మంచిర్యాల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లనే గోదావరి నదిలోని నీరు కిందికి పారడంలో జరుగుతున్న ఆలస్యం, నదిలోని వరద నీరు వెనక్కి నెట్టి, రాళ్లవాగు ద్వారా వాగు సమీప కాలనీలను ముంచెత్తుతోంది. శనివారం ముంపు కాలనీల్లో వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ పరిశీలించి, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. కాలనీలు వరద నీటిలో ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియకపోవడంతో బిక్కుబిక్కుమంటూనే ముంపు కాలనీ ప్రజలు కాలనీ వెళ్లదీస్తున్నారు. ఎన్టీఆర్‌నగర్ కాలనీలో కొన్ని ఇళ్లు వరదలో మునిగిపోగా, రాంనగర్‌లోని డూప్లెక్స్ ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మిగతా కాలనీల్లోని రోడ్లు, ఖాళీ ప్రదేశాలు వరద నీటితో మునిగిపోగా, ఇళ్ల సమీపంలోకి వరద నీరు వచ్చి చేరడం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రతి ఏటా వర్షాకాలంలో ముంపు కాలనీలకు వరద ముప్పు తప్పడం లేదు. ఎన్టీఆర్‌నగర్ నుంచి రాంనగర్‌కు వెళ్లే రహదారి జలమయం కావడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో రాంనగర్ డూప్లెక్స్ కాలనీలోని ఎనిమిది ఇళ్లను వరద చుట్టుముట్టింది. దీంతో ఆ ఇళ్లలోని వారిని డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్టీఆర్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ మీడియం) నీటమునిగింది. ఫర్నిచర్, విద్యార్థులను సమీపంలోని మన్నెగూడ పాఠశాలకు తరలించారు.

ముంచేస్తున్న వరద

ముంచేస్తున్న వరద

ముంచేస్తున్న వరద

ముంచేస్తున్న వరద

ముంచేస్తున్న వరద