
కుంభకోణానికి తెరతీసిన బెట్టింగ్..?
వ్యసనంగా మారి.. డబ్బులు కొల్లగొట్టి..
బ్యాంకు ఉద్యోగి ఆన్‌లైన్ ఆట
వందలాది మంది కుటుంబాల్లో ఆందోళన
చెన్నూర్: చెన్నూర్ ఎస్‌బీఐ బ్రాంచి–2లో ఇటీవల జరిగిన ఆభరణాలు, నగదు కుంభకోణంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వ స్తున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవా టుపడిన బ్యాంకు క్యాషియర్‌కు ఆ తర్వాత ఆట వ్యసనంగా మారినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో పెద్దయెత్తున లాభం వస్తుందని ఆశపడి క్రికెట్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ ఆటలు ఆడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం.
40మందిని విచారణ చేస్తున్న పోలీసులు
బ్యాంకులో రూ.12.61కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, రూ.1.10కోట్లు సదరు క్యాషియర్ కాజేసి ఖాతాదారులకు శఠగోపం పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు గత రెండ్రోజుల నుంచి మంచిర్యాలలోని ఎనిమిది ప్రైవేటు గోల్డ్‌లోన్ ఫైనాన్స్‌ల్లో సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. శుక్ర, శనివారాల్లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 16 నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరికొంత బంగారాన్ని రికవరీ చేసేందుకు ప్రైవేటు బ్యాంకుల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులో 20కిలోల బంగారు ఆభరణాలు గల్లంతు కాగా పూర్తి స్థాయిలో రికవరీ చేసేందుకు పోలీసులు నిమగ్నమయ్యారని సమాచారం. బ్యాంకులో పెద్దమొత్తంలో డబ్బును పది ఖాతాల్లోకి క్యాషియర్ బదిలీ చేసినట్లు గుర్తించి ఈ నెల 23న అధికారులు ఫిర్యాదు చేశారు. వారితోపాటు మరో 30 ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయినట్లు నిర్ధారించి వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు క్యాషియర్‌తోపాటు సుమారు 40మంది వరకు అదుపులో ఉన్నట్లు తెలిసింది. కాగా, క్యాషియర్ నిర్వాహకం కారణంగా బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న సుమారు 402మంది కుటుంబాల్లో అలజడి నెలకొంది.
ఉత్తమ ఉద్యోగి..!
చెన్నూర్ ఎస్‌బీఐ క్యాషియర్‌గా పని చేసిన నరిగే రవీందర్ బ్యాంక్‌లో ఖాతాదారులకు అందించిన సేవలకు గాను గత రెండు నెలల క్రితం ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నాడు. ఆభరణాలు, నగదు కాజేసి అటు బ్యాంకుకు ఇటు ఖాతాదారులకు శఠగోపం పెట్టడంతో అంతా కంగుతిన్నారు.
ముత్తూట్‌లో పోలీసుల విచారణ
చెన్నూర్: చెన్నూర్ పాతబస్టాండ్ సమీపంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో పోలీసులు శనివారం విచారణ జరిపారు. 400గ్రాముల బంగారం తాకట్టు పెట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది. కేసులోని అనుమానితుడు ఇచ్చిన సమాచారం మేరకు కోటపల్లి సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో ఎస్సైలు శ్యామ్‌పటేల్, రాజేందర్ బృందం విచారణ నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌బీఐ గోల్డ్‌లోన్ బాధితులు ఫైనాన్స్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులకు సహకరించి తమ బంగారు నగలు ఇవ్వాలని బైఠాయించారు. సోమవారం ఇస్తామని ఫైనాన్స్ అధికారులు లిఖితపూర్వకంగా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మంచిర్యాల ముత్తూట్ ఫైనాన్స్ ఎదుట చెన్నూర్ గోల్డ్‌లోన్ బాధితులు ఆందోళన చేపట్టారు.