
వరద బాధితుల రక్షణకు చర్యలు
మంచిర్యాలటౌన్: గోదావరి నది సమీప కాలనీల్లోని వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గోదావరి వరద ఉధృతిని, రాంనగర్‌లో ఇళ్ల మధ్యకు చేరిన వరద నీటిని, మాతాశిశు ఆసుపత్రికి వరద ముప్పును శనివారం కలెక్టర్ డీసీపీ ఏ.భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తుగా మాతాశిశు ఆసుపత్రిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 27 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. చేపల వేటకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం 08736–250501 నంబర్ ఏర్పాటు చేశామని, 24 గంటలు అందుబాటులో ఉండి సహాయం అందిస్తామని పేర్కొన్నారు.