
‘గుర్తింపు’ పోరులో సత్యపాల్ విజయం
పొరుగు నియోజకవర్గంలోనూ ప్రభావం
ఓటు వేసేందుకు బారులు తీరిన కార్మికులు
ఓటు హక్కు వినియోగించుకుంటున్న కార్మికుడు
కాసిపేట: మండలంలోని దేవాపూర్‌లో ఉన్న ఓరియంట్ సిమెంటు కంపెనీ(ఓసీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కొక్కిరాల సత్యపాల్‌రావు విజయం సాధించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సోదరుడు సత్యపాల్‌రావు 33 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై గెలుపొందారు. కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించి సాయంత్రం ఫలితాలు వెల్లడించారు. ఎన్నికల్లో ఐదు యూనియన్లు పోటీ చేయగా.. రెండు యూనియన్లు తమ మద్దతును ఇతర యూనియన్లకు ప్రకటించాయి. మొత్తం 266 ఓట్లు ఉండగా.. ఇందులో తొమ్మిది మంది ట్రెయినీ కార్మికుల ఓట్లను సీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టు నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో 265 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది ఓట్లను సీల్డ్ కవర్‌లో ఉంచి.. 256 ఓట్లను లెక్కించారు. ఇందులో ఓరియంట్ సిమెంటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్‌రావుకు 141 ఓట్లు, లోకల్ ఓరియంట్ సిమెంటు ఎంప్లాయిమెంటు వర్కర్స్ యూనియన్ అభ్యర్థి పూస్కూరి విక్రంరావుకు 108 ఓట్లు, ఓరియంట్ సిమెంట్ పర్మినెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ అభ్యర్థి తట్ర భీంరావుకు 6ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లకుండా పోయింది. దీంతో ప్రత్యర్థి విక్రంరావుపై సత్యపాల్‌రావు 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డీసీఎల్ యాదయ్య వ్యవహరించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ, బెల్లంపల్లి, తాండూర్ సీఐలు శశిధర్‌రెడ్డి, శ్రీనివాసరావు, దేవయ్య, దేవాపూర్, కాసిపేట, మందమర్రి, తాళ్లగురిజాల ఎస్సైలు గంగారాం, ఆంజనేయులు, రాజశేఖర్, భాస్కర్‌రావు, పలువురు సీఐలు, ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు.
పట్టు నిలబెట్టుకున్న పీఎస్సార్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పొరుగు నియోజకవర్గంలోనూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) తన పట్టు నిలబెట్టుకున్నారు. ఆయన అనుచర వర్గం వర్గం ముందుగానే ఊహించినట్లుగా దేవాపూర్‌లోని ఓరియెంట్ సిమెంట్ కంపెనీ(ఓసీసీ) గుర్తింపు కార్మిక ఎన్నికల్లో ఆయన సోదరుడు సత్యపాల్ గెలిచి సత్తా చాటారు. గెలుపు అనంతరం కంపెనీ గేటు ఎదుట పీఎస్సార్, సత్యపాల్ అనుకూల నినాదాల హోరు బలాన్ని తెలియజేస్తోంది. గతంలో పీఎస్సార్ తండ్రి కొక్కిరాల రఘుపతిరావు అధ్యక్షుడిగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తమ్ముడు సత్యపాల్ గెలిచి మరోసారి బెల్లంపల్లి నియోజకవర్గంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మునుపెన్నడు లేనివిధంగా జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రూ.లక్షల్లో డబ్బు ఖర్చు, మద్యం పంపిణీతోపాటు హంగామా జరగడంతో ఈ కార్మిక ఎన్నికపై అందరిలోనూ ఆసక్తి రేపింది.
మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల అభ్యర్థి ఓటమి
ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి మద్దతు తెలిపిన అభ్యర్థి ఓటమి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు స్వగ్రామం కాసిపేట మండలం ధర్మారావుపేట. ఆయన కుటుంబానికి ఆ ప్రాంతంలో ఆదరణ ఉంది. మరోవైపు మంత్రి వివేక్ తన బలగాన్ని గత వారం రోజులుగా ఎన్నికల కోసమే దింపారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వినోద్ ప్రచా రంలో స్వయంగా పాల్గొన్నారు. గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను ఇటీవల పలుమా ర్లు కోర్టుకు వెళ్లడంతో నిర్వహణలో జాప్యమైంది. ఆలస్యంతో ఆ ఓట్లను మళ్లించాలనే వ్యూహాం బెడిసికొట్టినట్లుగా కార్మిక నాయకులు చెబుతున్నారు. గతంలో గెలిచిన సంఘం కార్మికులను పట్టించుకోలేదని అపవాదు ఉంది. అదే సంఘం నుంచి అధికార పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మంత్రి వివేక్ స్వయంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించాలని కోరినా కార్మికులు మద్దతు ఇవ్వలేదు. మరోవైపు గత ఏడాది నుంచే సత్యపాల్ కార్మికులతో మమేకం కావడం, గెలుపు సులువైందని నాయకులు అంటున్నారు.

‘గుర్తింపు’ పోరులో సత్యపాల్ విజయం

‘గుర్తింపు’ పోరులో సత్యపాల్ విజయం