రేషన్‌.. కమీషన్‌ పెండింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రేషన్‌.. కమీషన్‌ పెండింగ్‌

Aug 30 2025 7:50 AM | Updated on Aug 30 2025 7:50 AM

రేషన్‌.. కమీషన్‌ పెండింగ్‌

రేషన్‌.. కమీషన్‌ పెండింగ్‌

● ఐదు నెలలుగా ఎదురు చూపులు ● ఆందోళనబాటలో డీలర్లు ● సెప్టెంబర్‌ నెల బియ్యం పంపిణీ చేసేనా..!

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లకు కమీషన్‌ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా ఎదురు చూస్తూ ఆందోళన బాట పట్టారు. నెలాఖరులోగా కమీషన్‌ విడుదల చేయని పక్షంలో వచ్చే నెల బియ్యం పంపిణీ చేపట్టబోమని పేర్కొంటున్నారు. గత ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు కమీషన్‌ విడుదల కాలేదు. మళ్లీ సెప్టెంబర్‌ నెల బియ్యం సరఫరాకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి దుకాణాలకు పంపించింది. ఇటు దుకాణాల అద్దె, వర్కర్ల జీతం తదితర ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఈ నెల 25న జిల్లాలోని రేషన్‌ డీలర్లు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌, పౌరసరఫరాల శాఖ అధికారికి వినతిపత్రాలు అందజేశారు.

ఐదు నెలలుగా పెండింగ్‌

ప్రజలకు బియ్యం పంపిణీ చేసినందుకు గాను క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.95, రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కమీషన్‌ అందిస్తుంది. ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి 20వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తుంటారు. జిల్లాలో ప్రతీ నెల 42 వేల నుంచి 44వేల క్వింటాళ్ల బియ్యం లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కమీషన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. గత కొంతకాలంగా గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కమీషన్‌ కూడా సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత మార్చిలో ప్రభుత్వం సరఫరా చేసిన మిగులు దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయి వాటిని కాపాడలేక అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో తడిసిపోవడం, ఎలుకలు తినడం, ముక్క పట్టకుండా చూడాల్సి వస్తోంది. హమాలీ ఖర్చులు, గదుల అద్దె, చిని గిన గన్నిబ్యాగులు, బియ్యం తక్కువగా వచ్చినా కమీషన్‌ నుంచి కోత విధిస్తుంటారు. ఈ నెల కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారితోపాటు పాతకార్డుదారులు మొత్తంగా 2,48,807 మంది ఉన్నారు. వీరికి 46,931 క్వింటాళ్ల బియ్యం పంపిణీకి రేషన్‌ దుకాణాలకు చేరాయి. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ కమిషన్‌ విడుదల చేయడంతోపాటు కనీస గౌరవ వేతనం రూ.5వేలు చెల్లించాలని, కమీషన్‌ రూ.300 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, డీలర్ల కమీషన్‌ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావును సంప్రదించగా.. గతంలో రెండు నెలలు, ఇటీవల మూడు నెలలకు సంబంధించి రేషన్‌ కమీషన్‌ బిల్లులు కమిషనరేట్‌కు పంపించామని, నేడో రేపు విడుదలవుతాయని తెలిపారు. సెప్టెంబర్‌ నెల రేషన్‌ బియ్యం సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement