
అధైర్యపడొద్దు అండగా ఉంటాం
జైపూర్: భారీ వర్షాలతో పంటలు ముంపునకు గురైన రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మండలంలోని వేలాలలో భారీ వర్షాలతో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. పార్వతిబ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి, పరీవాహక ప్రాంతాల పరిస్థితి చూశారు. అనంతరం వేలాలలో నీట మునిగిన పంటలు పరిశీలించి రైతుల వివరాలతో పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వేలాల పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద తీవ్రతను పరిశీలించారు. మంచిర్యాల–వరంగల్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో కిష్టాపూర్–రొమ్మిపూర్ వద్ద ఇంటర్ ఛేంజ్ సౌకర్యం కల్పించాలని స్థానిక రైతులు ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు.
యూరియా ఇవ్వాలి
వేలాల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఐదెకరాలు సాగు చేస్తున్న రైతులకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కుమార్‌దీపక్ స్పందిస్తూ జిల్లాలో యూరియా, ఇతర ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, కొందరు రైతులు అవసరానికి మించి తీసుకోవడం కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఎంసీహెచ్ తరలింపు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే
మంచిర్యాలటౌన్: గత ప్రభుత్వం రూ.20 కోట్లతో నిర్మించిన ఎంసీహెచ్ పనికిరాకుండా పోతోందని, 2022 నుంచి ప్రతి ఏటా వర్షాకాలంలో వరదల్లో మునిగిపోతోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయంతో నిర్మించడమే కారణమని విమర్శించారు. శుక్రవారం ఆయన మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూడా పనికిరాకుండా పోయిందన్నారు. నాణ్యత లోపాలతోపాటు ఎక్కడ నిర్మించాలన్న సోయి కూడా లేకుండా పోయిందని, ఎంసీహెచ్‌కు ఈ దుస్థితికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.