
‘ఎల్లంపల్లి’కి పోటెత్తిన వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/చెన్నూర్‌రూరల్/జన్నారం: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 12.910 టీఎంసీల నీటి నిల్వతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 2.30లక్షల క్యూసెక్కులు, ఎస్సారెస్పీ నుంచి 6లక్షల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 1,800 క్యూసెక్కుల నీరు కలిపి మొత్తంగా 8.30లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 40గేట్లు ఎత్తి 7.30లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. అధికారులు ఇన్‌ఫ్లోను అంచనా వేస్తూ వేగంగా నీటిని వదులుతుండడంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 301 క్యూసెక్కులు తరలిస్తున్నారు.