
నేడు ఓసీసీ ‘గుర్తింపు’ ఎన్నికలు
కాసిపేట: మండలంలోని దేవాపూర్‌లో ఉన్న ఓరియంట్ సిమెంటు కంపెనీ(ఓసీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. 266మంది ఓటర్లు ఉండగా.. వీరిలో తొమ్మిది మంది ఓటు హక్కుపై వివాదాల నేపథ్యంలో ఓటు వేయించి సీల్డ్ కవర్‌లో భద్రపరుస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డీసీఎల్ యాదయ్య వ్యవహరిస్తారు. కాగా, ప్రధాన పోటీదారులు ఇద్దరు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శిబిరాలు, విహారయాత్రలు, ఓటుకు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు పంపిణీతో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా మంత్రి వివేక్ రంగంలోకి దిగి గెలుపు కోసం పావులు కదుపుతున్నట్లు తెలిసింది. నాయకులతోపాటు కార్మికులకు ఫోన్లు చేసి సహకరించాలని కోరినట్లు సమాచారం. సర్పంచు, ఎంపీటీసీ ఎన్నికల్లో టికెట్లలో ప్రాధాన్యత ఇస్తామంటూ అందరూ సహకరించాలని చక్రం తిప్పుతున్నారు. పీఏలు ఇక్కడే మకాం వేశారు.
పోలీసుల కవాతు
ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి పోలీసులు కవాతు నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, దేవాపూర్, కాసిపేట, బెల్లంపల్లి ఎస్సైలు గంగా రాం, ఆంజనేయులు, భాస్కర్, డివిజన్ పరిధిలోని పోలీసులు పాల్గొన్నారు.