
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
రామకృష్ణాపూర్: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లిలోని సుమన్ స్వగృహంలో సోమవారం స్థానిక సంస్థల సన్నాహక సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.4వేల పింఛన్, నిరుద్యోగ భృతి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, రూ.2 లక్షల రుణమాఫీ తదితర హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందా లేదా అనేది ఇంటింటి వెళ్లి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని కలెక్టర్ కార్యాలయంలో ఇద్దామని పేర్కొన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు, 45 వేల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాజారమేష్, బడికల సంపత్, జె.రవీందర్, రామిడికుమార్ తదితరులు పాల్గొన్నారు.