
అడవికి కొత్త రక్షకుడు
జన్నారం: అటవీ సంరక్షణకు ఆ శాఖ డాగ్‌స్క్వాడ్‌లను రంగంలోకి దించుతోంది. గతంలో చీతా అనే డాగ్‌స్క్వాడ్ ఉండేది. గతేడాది అనారోగ్యంతో మరణించింది. దానిస్థానంలో కొత్త డాగ్‌స్క్వాడ్ ‘హంటర్’ చేరింది. కవ్వాల్ టైగర్ జోన్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ వేట, స్మగ్లర్లను గుర్తించేందుకు హంటర్‌ను ఉపయోగిస్తామని అటవీ అధికారులు తెలిపారు.
ఏడు నెలల కఠిన శిక్షణ..
హరియాణాలోని చండీగఢ్‌లో ఉన్న నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్‌లో హంటర్‌కు ఏడు నెలలు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జనవరి 27 నుంచి ఆగస్టు 9 వరకు జన్నారం డివిజన్‌కు చెందిన బీట్ అధికారులు అనిల్‌కుమార్, పరమేశ్ కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు. నేరస్తులను గుర్తించే మెలకువలు, రోజువారీ వ్యాయామం, ఆహారం, సంరక్షణ విధానాలపై వీరు నైపుణ్యం సాధించారు. శిక్షణ పూర్తయిన తర్వాత జరిగిన ట్రైనింగ్ పరేడ్‌లో హంటర్ దేశవ్యాప్తంగా పోటీపడిన డాగ్‌స్క్వాడ్‌లలో మూడో స్థానం సాధించింది.
ప్రత్యేక సంరక్షణ..
హంటర్‌ను సంరక్షించేందుకు ప్రత్యేక వాచర్‌ను నియమించారు. డాగ్ హ్యాండ్లర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ హ్యాండ్లర్ పరమేశ్ రోజూ హంటర్‌కు వ్యాయామం, ఆహారం, సంరక్షణ అందిస్తారు. నెలకోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అటవీ నేరాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక బొలెరో వాహనం సిద్ధం చేశారు. కవ్వాల్ టైగర్ జోన్‌లో ఎక్కడైనా నేరం జరిగితే, హంటర్ సహాయంతో నేరస్తులను పట్టుకుంటారు.
నాలుగు రోజుల్లోనే ప్రతిభ..
ఈ నెల 12న జన్నారం అటవీ డివిజన్‌కు చేరిన హంటర్ నాలుగు రోజుల్లోనే తన సామర్థ్యాన్ని చాటింది. జన్నారం రేంజ్‌లోని గొండుగూడ బీట్‌లో ఈ నెల 16న గుర్తు తెలియని వ్యక్తులు టేకు చెట్లను నరికివేశారు. సమాచారం అందుకున్న బీట్ అధికారి అక్కడికి చేరుకునే సరికి నేరస్థులు పారిపోయారు. మరుసటి రోజు హంటర్‌ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లగా, అక్కడ ఉన్న నిందితుడి షర్టు వాసన ఆధారంగా జువ్విగూడలోని రాథోడ్ హరిలాల్ ఇంటికి చేరి అతన్ని గుర్తించింది. హంటర్‌ను చూసిన హరిలాల్ పారిపోయినప్పటికీ, అతనే నేరం చేశాడని అధికారులు నిర్ధారించి కేసు నమోదు చేశారు.
గ్రామాల్లో అవగాహన..
జన్నారం అటవీ డివిజన్‌లోని గ్రామాల్లో హంటర్ డాగ్‌స్క్వాడ్ గురించి అవగాహన కల్పించేందుకు ఎఫ్‌డీవో రామ్మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. హంటర్ శిక్షణ, నేరస్థులను గుర్తించే విధానం గురించి వివరిస్తూ, అటవీ నేరాలకు పాల్పడే వారిని హంటర్ వదిలిపెట్టదని హెచ్చరిస్తున్నారు. గతంలో ‘ఛీతా’ సాధించిన విజయాలు, హంటర్ శిక్షణ విశేషాలను వివరిస్తూ, చెట్ల నరికివేత, వన్యప్రాణుల వేట నుంచి నిందితులు తప్పించుకోలేరని స్పష్టం చేస్తున్నారు.
నూతనంగా
తీసుకువచ్చిన డాగ్‌స్క్వాడ్
హంటర్

అడవికి కొత్త రక్షకుడు