
ఎస్బీఐ కేసులో పురోగతి!
చెన్నూర్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) చెన్నూర్ బ్రాంచ్–2లో జరిగిన కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. క్యాషియర్ నరిగే రవీందర్, పక్కా ప్రణాళికతో రూ.13.71 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు తస్కరించాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, బ్యాంక్ మేనేజర్‌కు అనుమానం రాకుండా తెలివిగా ఈ మోసం చేశాడు. ఈ నెల 21న బ్యాంక్ మేనేజర్‌కు అనుమానం రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రెండు రోజులు జరిపిన సమగ్ర తనిఖీలో రూ.12.61 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ భారీ మోసం బ్యాంకు అధికారులనూ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు పొందిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
సవాల్‌గా తీసుకున్న పోలీసులు..
బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చెన్నూర్ పోలీసులు, ఈ కుంభకోణాన్ని సవాల్‌గా స్వీకరించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా ఆదేశాలతో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు నిందితుడు రవీందర్‌ను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు చేపట్టాయి. ప్రధాన నిందితుడు, క్యాషియర్ నరిగే రవీందర్‌తోపాటు అతనికి సహకరించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలలో పనిచేస్తున్నట్లు సమాచారం. నిందితులంతా సింగరేణి పారిశ్రామిక ప్రాంత వాసులని తెలిసింది.
మేనేజర్‌పై అనుమానాలు..
పది నెలలుగా బ్యాంకు నుంచి కిలోల కొద్దీ బంగారం, లక్షల కొద్దీ నగదు మాయమవుతున్నా, బ్యాంక్ మేనేజర్ పట్టించుకోకపోవడం ఖాతాదారుల్లో అనుమానాలకు తావిస్తోంది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం ఈ కుంభకోణానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు రవీందర్ విచారణతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పది మందిపై కేసు నమోదైనప్పటికీ, మరింత మంది నిందితులు ఈ కేసులో చిక్కుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఖాతాదారుల్లో ఆందోళన..
ఈ కుంభకోణంతో సుమారు 448 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమైనట్లు తెలిసింది. బ్యాంకు అధికారులు ఖాతాదారుల ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని భరోసా ఇచ్చినా బాధితులకు నమ్మకం కుదరడం లేదు. మాయమైన బంగారం రికవరీ చేయకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు సోమవారం బ్యాంకు ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నారు.