
‘సర్వాయి’ని స్ఫూర్తిగా తీసుకోవాలి
జన్నారం: ఐదుగురితో ఎదురుదాడి మొదలు పెట్టి, వేలాది మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వారోత్సవాల్లో భాగంగా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడన్నలకు రక్షణగా కాటమయ్య కిట్లు ప్రజా ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని గౌడన్నలకు కూడా కాటమయ్య కిట్లు అందిస్తామని పేర్కొన్నారు. ఆలస్యం అయినా హామీలు అమలు చేయడం మాత్రం పక్కా అన్నారు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు తెచ్చి మరమ్మతు చేయించానని చెప్పారు. కవ్వాల్ రైతులు ఎదుర్కొంటున్న మత్తడి కాలువకు మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, కవ్వాల్ గ్రామ అధ్యక్షుడు కాసారపు పోశగౌడ్, ఉపాధ్యక్షుడు బాలగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సత్యగౌడ్, తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాటప్రకారం..
జన్నారం: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు కవ్వాల్‌కు వస్తానని గౌడ సంఘం నాయకులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట ఇచ్చారు. ఈమేరకు కవ్వాల్ గ్రామానికి వచ్చే దారిలో రెండు గ్రామాల ప్రజలు గ్రామ దేవతలకు చేసుకోవడంతో రాకపోకలు నిలిపివేశారు. దీంతో మరో మార్గంలో ఎమ్మెల్యే వాహనం వెళ్లలేని పరిస్థితి. దీంతో రేండ్లగూడ వరకు తన వాహనంలో వచ్చిన ఎమ్మెల్యే అక్కడి నుంచి సుమారు 6 కి.మీలు బైక్‌పై ప్రయాణించి కవ్వాల్ చేరుకున్నారు.