
విద్య, వైద్యంపై సింగరేణి దృష్టి
జైపూర్: జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) పరిసర ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం అందించడంపై సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాంటు ఏర్పాటు దశలోనే వైద్యసేవలు, సింగరేణి స్కూల్ ఏర్పాటుపై అప్పటి అధికార యంత్రాంగం హామీనిచ్చింది. అమలులో భాగంగా సీబీఎస్‌ఈ స్కూల్, ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తోంది. ప్లాంటు ఏర్పాటుతో ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, జైపూర్ మరో ఎన్టీపీసీలా మారుతుందని ప్రజలు ఆశించారు. అందుకు తగినట్లుగానే అప్పటి సింగరేణి అధికారుల హామీ మేరకు స్థానిక రైతులు వారి విలువైన భూములను త్యాగం చేశారు. 2010లో ప్లాంటు పనులు ప్రారంభించగా.. 2017లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. రెండు యూనిట్ల ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతోంది. సింగరేణి సీబీఎస్‌ఈ స్కూల్, ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటుకు సంస్థ ఆమోదించి అనుమతి పొందగా.. ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రెండు వేల మంది ఉద్యోగులు
జైపూర్‌లోని 1200 మెగావాట్ల ప్లాంటులో స్థానిక భూనిర్వాసితులతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సుమారు రెండు వేల మందికిపైగా ఇక్కడ పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవర్‌మేక్ కంపెనీ విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ(ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్) చేపడుతోంది. ఉద్యోగులకు ఎస్టీపీపీలో క్వార్టర్లు కేటాయించగా కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. వీరితోపాటు స్థానికులు ఆయా డిపార్టుమెంట్లలో పని చేస్తున్నారు. పిల్లల చదువు, వైద్యం కోసం మంచిర్యాలకు వెళ్లాల్సి వస్తోంది. ఉద్యోగులు, కార్మికులు, ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్య సౌకర్యం కల్పించాలనే డిమాండ్‌తో ఈఎస్‌ఐ ఆస్పత్రి, పిల్లల చదువుల కోసం స్కూల్ ఏర్పాటు చేయాలని అనేకసార్లు ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఎట్టకేలకు ఎస్టీపీపీలో వచ్చే ఏడాది జూన్‌లో నర్సరీ నుంచి 7వ తరగతి వరకు సింగరేణి సీబీఎస్‌ఈ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎస్టీపీపీలో నిర్మించిన భవనంలో తాత్కాలికంగా స్కూల్ ప్రారంభిస్తారు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీ మంజూరు కావడంతో భవన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాత్కాలికంగా క్వార్టర్లలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ త్వరలో ప్రారంభించనున్నారు.