
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల వాస్తవ పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణతో అభివృద్ధి పనుల్లో వేగం, కింది స్థాయి సిబ్బందిలో అలసత్వం తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ జిల్లా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. అభివృద్ధి కాగితాల్లో కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు తెలుసుకుంటూ లోపాలను సరిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిష్టర్లు, ఫైళ్లు తదితర వివరాలు అడుగుతున్న నేపథ్యంలో అధికారుల్లో భయం నెలకొంది. కొన్ని చోట్ల అలసత్వం వహిస్తున్న అధికారులను హెచ్చరిస్తున్నారు. అవసరమైతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
అధికారులు అప్రమత్తం
విద్యా, వైద్యారోగ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సేవలు, గ్రామాలు, పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పరిశీలనల కోసం కలెక్టర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు వేగిరం చేసేందుకు కలెక్టర్ పర్యటనలు దోహదపడుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, రోగుల ఇబ్బందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రతీరోజు ఉదయం తప్పనిసరిగా ఏదైనా మండలంలోని ప్రభుత్వ, ఆశ్ర మ, గురుకుల, విద్యాసంస్థలు, వసతిగృహాలు సందర్శిస్తున్నారు. విద్యార్థులకు అందుతున్న బోధన, టీచర్లు, సిబ్బంది తీరును తెలుసుకుంటున్నారు. భోజనం, వసతి, పరిశుభ్రతను ప్రత్యక్షంగా చూస్తున్నారు. విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే విషయాలతోపాటు స్వీయ అనుభవంతోనూ తన విధుల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతోంది.