
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్ ఆవరణలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులు, మతపెద్దలు, వినాయక మండపాల నిర్వాహక కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మతపెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ గణేష్ చతుర్థి, మిలాద్–ఉన్–నబీ పండుగలు శాంతియుతంగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలు వాలని అన్నారు. గత సంవత్సరం మంచిర్యాల జిల్లాలో 2,316 వినాయక విగ్రహాలు నెలకొల్పార ని, గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీసుస్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేస్తామని, మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అసత్య వార్తలను నమ్మి శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలున్నా 100డయల్‌కు సమాచారం అందించాలని తెలిపారు. పోలీసులు సూచించిన రోడ్ మ్యాప్ ఆధారంగా శోభాయాత్ర నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, రమేష్, ప్రతాప్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.