
‘నవభారత్ సాక్షరత’ సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వయోజన విద్య కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్యతో కలిసి మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉల్లాస్–నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. 15 సంవత్సరాలు, ఆ పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతోపాటు కీలక జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత అందించాలని తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం మండల స్థాయిలో విజయవంతానికి మండల విద్యాధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారుల చౌదరి, సత్యనారాయణ, డీఆర్‌పీలు జనార్ధన్, సుమన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.