
భక్తిమార్గం.. ఐక్యతా మంత్రం!
స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉత్సవాలకు ప్రాధాన్యత ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రారంభం.. ఇప్పటికీ కొనసాగుతున్న ఐక్యతా వేడుకలు సాంప్రదాయ, పర్యావరణ హితంగా పండుగ
భైంసా: భారతదేశంలో గణేశోత్సవం కేవలం మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, స్వాతంత్య్ర సమరంలో ప్రజలను సమీకరించిన చారిత్రక ఉద్యమం కూడా. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం బాలగంగాధర్ తిలక్ ఈ ఉత్సవాన్ని ఒక శక్తివంతమైన వేదికగా మలిచారు. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కోసం దేశభక్తులు అవిశ్రాంత పోరాటం చేస్తున్న కాలమది. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు, నలుగురు ఒకచోట కలుసుకునేందుకు కూడా బ్రిటీష్ ప్రభుత్వం అనుమంతించేది కాదు. ఈ పరిస్థితుల్లో బాలగంగాధర్ తిలక్ ఒక వినూత్న ఆలోచన చేశారు. గణేశ్ ఉత్సవాల పేరిట ప్రజలను సమీకరించి స్వాతంత్య్రానికి సంబంధించిన విషయాలను ప్రజలకు చేరవేయాలనుకున్నారు. దేశభక్తి, దైవభక్తి ఉన్న తిలక్ 1893లో మహారాష్ట్రలోని పుణేలో శ్రీకస్బ గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభించాడు. అప్పటి నుంచి ఏళ్లుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
1905లో కుభీలో..
ముధోల్ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది. ఈ ప్రాంతం నాందేడ్ జిల్లా పరిధిలోకి వచ్చేది. గణేశ్ ఉత్సవాలను ప్రారంభించిన బాలగంగాధర్ తిలక్ దేశమంతా పర్యటించారు. ఆ క్రమంలో ఇప్పటి నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గ పరిధి కుభీర్‌కు చేరుకున్నారు. అప్పుడు కుభీర్‌ను పాలించే యశ్వంత్‌రావు దేశ్‌ముఖ్‌కు తిలక్ దగ్గరి బంధువు. 1905లో కుభీర్‌లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కుభీర్‌ను పాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్ గణేశ్ ఉత్సవాలను నిర్వహించేవారు. 1950 నుంచి 40ఏళ్ల పాటు కుభీర్‌కు చెందిన వైద్యనాథ్ ఉత్సవాల నిర్వహణ చూసుకున్నారు. 120 ఏళ్లుగా కుభీర్‌లో గణేశ్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
భైంసా పట్టణంలో 106 ఏళ్లుగా..
భైంసాలో 1919లో సార్వజనిక్ గణేశ్ మండళి వారు గోపాలకృష్ణ మందిరంలో మొదటిసారిగా నారాయణవాగ్ సమక్షంలో ఉత్సవాలు ప్రారంభించారు. 106 ఏళ్లుగా మందిరంలో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిమజ్జనం రోజున ఇక్కడే పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 1921లో హతిగణేశ్ మండలి ఉత్సవాలు ప్రారంభించింది. ప్రస్తుతం భైంసా పట్టణంలో 100కు పైగా మండలీలు గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. అప్పట్లో అంతా కలిసి భజనలు చేస్తూ ఒకేచోట చేరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు.