
భార్య దూకిన బావిలోనే భర్త ఆత్మహత్య
తలమడుగు: భార్య ఆత్మహత్య చేసుకున్న బావిలోనే భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన జాదవ్ దేవిశ్రీ ప్రసాద్(27) జిల్లా కేంద్రంలోని ఐటిఐ కాలేజీలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్య జాదవ్ సువాసిని జూలై 10న తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో భార్య సుహాసిని కుటుంబ సభ్యులు దేవిశ్రీ ప్రసాద్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో మనస్తాపం చెంది భార్య సుహాసిని ఆత్మహత్య చేసుకున్న బావిలోనే దూకి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి సింధుబాయి ఫిర్యాదు మేరకు ఎస్సై రాధిక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో..
నస్పూర్: ఆర్థిక ఇబ్బందులతో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంపూర్ ఏరియా హిమ్మత్‌నగర్‌కు చెందిన చింతల నర్సింగం (47) శ్రీరాంపూర్ ఏరియా ఓసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా ఆందోళన చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఇంటి పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై ఒకరు..
కౌటాల: మండలంలోని కనికి గ్రామానికి చెందిన నాయిని మధుకర్(34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విజయ్ శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మధుకర్ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఆవేశంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శనివారం ఎస్సై మధుకర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. మృతుడి భార్య రాంబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

భార్య దూకిన బావిలోనే భర్త ఆత్మహత్య