
ఎస్‌బీఐ కుంభకోణంలో నిందితుడు క్యాషీయర్
రూ.12.61 కోట్ల విలువైన బంగారం, రూ.1.10 కోట్ల నగదు గల్లంతు తొమ్మిది మంది ఖాతాలకు నగదు బదిలీ వివరాలు వెల్లడించిన సీఐ
చెన్నూర్: చెన్నూర్ ఎస్‌బీఐ బ్రాంచి–2లో నగలు, నగదు గల్లంతు లెక్క తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు క్యాషీయరేనని అధికారులు నిర్ధారించారు. స్థానిక సీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. బ్యాంక్‌లో ఖాతాదారులు తనఖా పెట్టిన నగలు, నగదు మాయమైనట్లు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు గురువారం నుంచి శనివారం వరకు ఆడిట్ నిర్వహించారు. బ్యాంక్ క్యాషీయర్ నరిగే రవీందర్ రూ.12.61 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 1.10 కోట్ల నగదు మాయం చేసినట్లు గుర్తించారు. రవీందర్ ఖాతా నుంచి తొమ్మిది మంది కొండంగి బీరేశ్, నరిగే సరిత, నరిగే స్వర్ణలత, ఉమ్మల సురేశ్, కొదాటి రాజశేఖర్, గౌడ సుమన్, ఎసంపల్లి సాయికిరణ్, ఎల్.సందీప్, మోత్కూరి రమ్యల ఖాతాలకు పెద్దఎత్తున డబ్బులు బదిలీ కాగా, అందరి ఖాతాలు సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. రవీందర్‌తో పాటు మరో పది మందిపై మంచిర్యాల రీజినల్ మేనేజర్ రితేశ్‌గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రవీందర్ పరారీలో ఉన్నారని, ఐదు పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రవీందర్ దొరికితే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, బంగారాన్ని రికవరీ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.
‘కస్టమర్లు ఆందోళన పడొద్దు’
చెన్నూర్: బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి ఆందోళన పడొద్దని ఎస్‌బీఐ మంచిర్యాల రీజనల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా అన్నారు. శనివారం రాత్రి బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటారన్నారు. సమావేశంలో బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.