
అట్టహాసంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
రెబ్బెన: మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లో గల సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం 71వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 10 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు తరలిరావడంతో సందడి నెలకొంది. పోటీలకు సుమారు 240 మంది క్రీడాకారులతో పాటు అసోషియేషన్ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి బాల్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్‌తో కలిసి మైదానంలో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను మారుమూల జిల్లాలో నిర్వహించడం సంతోషకరమన్నారు. క్రీడాకారులు నైపుణ్యాలను ప్రదర్శించి పోటీల్లో రాణించాలని సూచించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి, ఒలంపిక్ అసోషియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, బాల్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు మొగిళి, ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా పోటీలు..
గోలేటిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు మొదటి రోజే క్రీడాభిమానుల్లో ఉత్తేజాన్ని నింపేలా జరిగాయి. పురుషుల పోటీల్లో ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జట్లు గెలుపొందగా మహిళల విభాగంలో నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జట్లు గెలుపొందాయి.