
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం దొనబండ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వాచ్‌మెన్ ఆవునూరి లింగయ్య(55) విద్యుదాఘాతంతో మృతిచెందాడు.. పోలీసుల కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండలం గుల్లకోటకు చెందిన ఆవునూరి లింగయ్య దొనబండలోని ఫంక్షన్ హాల్‌లో గత పదేళ్లుగా వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఫంక్షన్ హాల్‌లో పనుల నిమిత్తం శనివారం పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ నుంచి ఇనుప స్టాండ్‌ను పంప్‌లో పని చేసే బుర్ర వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి లింగయ్య తీసుకొస్తున్నాడు. పైన ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు స్టాండ్‌కు తగలడంతో షాక్‌కు గురయ్యారు. లింగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. రామగుండం మండలం కుందన్‌పల్లికి చెందిన వెంకటేశ్‌గౌడ్ స్వల్పంగా గాయపడగా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్, లక్సెట్టిపేట ఎస్సై సురేశ్, నస్పూర్ ఎస్సైలు ఉపేందర్‌రావు, జితేందర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య రాజవ్వ, కుమారుడు జయరాజ్, కుమార్తె వసంత ఉన్నారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు.