
అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
ముధోల్: మండలంలోని తరోడా గ్రామానికి చెందిన ఎయిర్ ఫోర్స్ జవాన్ లక్ష్మీఈశ్వరప్రసాద్(25) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఇటీవల ఆయన ఆగ్రా దగ్గరలో ఉన్న దమ్మవాటర్‌ఫాల్‌లో ప్రమాదవశాత్తు పడి మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం మృతదేహాన్ని స్వగ్రామం తరోడాకు తరలించారు. ఎయిర్‌ఫోర్స్ అధికారి ప్రవీణ్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో మృతదేహంపై జవాన్లు త్రివర్ణ పతాకాన్ని కప్పి నివాళుల ర్పించారు. చివరి చూపు కోసం మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పవార్ రామరావుపాటిల్ హాజరై నివాళులర్పించారు. శ్మశాన వాటికలో మృతదేహం చితిపై పెట్టి ఎయిర్‌ఫోర్స్ జవాన్లు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో ముగించారు. అనంతరం చితికి మృతుడి తండ్రి నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్, తదితరులు పాల్గొన్నారు.