
‘ఆపరేషన్ కగార్’ నిలిపి వేయాలి
ఆదిలాబాద్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ హత్యాకాండను నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. శనివారం మావల మండలంలోని బట్టిసావర్‌గాం శివారు ప్రాంతంలో గల కుమురంభీం గూడలో ‘చలో హన్మకొండ’ బహిరంగా సభ కరపత్రాలు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం హన్మకొండలోని అంబేడ్కర్ భవనంలో కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ అంశంపై జరిగే బహిరంగా సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఆదివాసీల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను తుంగలో తొక్కుతూ ఆపరేషన్ కగార్ పేరిట మారణకాండ కొనసాగిస్తుందన్నారు. తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర, డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, సోయం లిలిత తదితరులు పాల్గొన్నారు.