
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
కోటపల్లి/చెన్నూర్‌రూరల్: కాశేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే నిర్మించారని, ఏటేటా పంటలు నీటమునిగి రైతులు నష్టపోతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. శుక్రవారం ఆయన కోటపల్లి మండలం దేవులవాడ, రాంపూర్, చెన్నూర్ మండలం సుందరశాల గ్రామాల్లో నీటమునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణం తర్వాత కోటపల్లి మండలం బబ్బరుచెల్క, రాంపూర్, దేవులవాడ, వెంచపల్లి ప్రాంతాల్లో బ్యాక్ వాటర్‌తో పంటలు మునిగి నష్టపోతున్నారని తెలిపారు. కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో పంటల నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పరిహారం అందేలా చూస్తానని హామీనిచ్చారు. అనంతరం దేవులవాడ గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సెంట్రల్‌లైటింగ్ పనులు, కొల్లూరు గ్రామంలో అంగన్‌వాడీ పనులు, చెన్నూర్ మండలం లంబాడిపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల జాతర ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ కుమార్ దీపక్, డీపీవో వెంకటేశ్వర్‌రావు, మిషన్ భగీరథ డీఈ విద్యాసాగర్‌రావు, ఎంపీడీవో మోహన్ తదితరలు పాల్గొన్నారు.
లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం..
జైపూర్/భీమారం: సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుతోపాటు ప్రభుత్వ శాఖల్లో రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. పనుల జాతరలో భాగంగా శుక్రవారం జైపూర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రూ.3లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్, భీమారం మండల కేంద్రంలో రూ.20లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి వివేక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జైపూర్‌లో 800మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, కొత్త ప్లాంటులో స్థానికులు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంటు సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. మణుగూరులో జరిగిన ఘటనలో చెరువులో పడి మృతిచెందిన సింగరేణి కార్మికుడు శ్రీనివాస్ కుటుంబాన్ని జైపూర్‌లో మంత్రి పరామర్శించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు పొడేటి రవి, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఎంపీడీవో మధుసూదన్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.