
5.5కిలోల బంగారం, రూ.1.07కోట్లు మాయం?
చెన్నూర్ ఎస్‌బీఐలో కుంభకోణం
రెండ్రోజులుగా సాగుతున్న విచారణ
క్యాషియర్‌తోపాటు మరికొందరు అధికారుల హస్తం
ఏడాదిగా కొనసాగుతున్న వ్యవహారం
చెన్నూర్: చెన్నూర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బ్రాంచ్–2లో రూ.1.07కోట్ల నగదు, సుమారు రూ.12.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు(ఐదున్నర కిలోలు) మాయమైనట్లు తెలుస్తోంది. ఇందులో బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్‌తోపాటు కొందరు బ్యాంకు అధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నగలు, నగదు మాయంపై రెండ్రోజులుగా బ్యాంకు ఉన్నతాధికారులతో కలిసి పోలీసుల విచారణ సాగుతోంది. ఇంత పెద్దమొత్తంలో నగదు, ఆభరణాలు మా యం చేయడం ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్రైమాసిక, వార్షిక ఆడిట్‌లోనూ మోసాలు బయటకు రాకుండా ఖాతాదారుల ఆభరణాలను మాయం చేశారంటే పక్కా పథకం ప్రకారమే వ్యవహారం నడిపారని భావిస్తున్నారు. బ్యాంకులో సాగుతున్న విచారణను శుక్రవారం మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బ్యాంకు వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ దేవేందర్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ సాగుతోందని, బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఏసీపీ, సీఐ తెలిపారు.
నమ్మకంగా ఉంటూ..
క్యాషియర్ నరిగే రవీందర్ ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. తనకు పరిచయం ఉన్న ఖాతాదారుల వద్ద సైతం రూ.లక్షల్లో తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఇచ్చిన వారు తల పట్టుకుంటున్నట్లు సమాచారం. పలువురి వద్ద రూ.10లక్షలకు పైగా చేబదులు తీసుకున్నట్లు తెలిసింది.
ఖాతాదారుల ఆందోళన
బంగారం, నగదు మాయం విషయం తెలుసుకున్న ఖాతాదారులు శుక్రవారం బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. బ్యాంకులో సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసాతో ఉండగా శఠగోపం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరాల నిమిత్తం బ్యాంక్‌లో బంగారం పెట్టి రుణం తీసుకుంటే సొత్తును బ్యాంకర్లే కాజేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఖాతాదారుల సొత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు.