
మార్కెట్ యార్డు నిర్మాణంలో జాప్యం
యార్డు స్థలంలో వైద్య కళాశాల
జిల్లా కేంద్రంలోని దుకాణ సముదాయంలో కార్యాలయం
హాజీపూర్‌లో స్థలం ఎంపికై నా ఖరారు కాని వైనం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మార్కెట్ యార్డు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెట్ యార్డును జిల్లా వైద్య కళాశాల ఆస్పత్రికి కేటాయించడంతో ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన స్థల సేకరణ ఆలస్యమవుతోంది. మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల, హాజీపూర్, నస్పూర్, మందమర్రి ప్రాంతాల రైతులకు సౌకర్యార్థం మంచిర్యాల మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశారు. ధాన్యం తదితర పంట ఉత్పత్తుల కొనుగోళ్లతో జిల్లాలోనే అధిక ఆదాయం కలిగిన మార్కెట్ కమిటీగా పేరొందింది. అలాంటి మార్కెట్ కమిటీకి శాశ్వత స్థల సేకరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం దృష్టి సారిస్తే తప్ప యార్డు, కార్యాలయ ఏర్పాటుకు శాశ్వతంగా అడుగులు పడేలా లేవు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట శివారు గోదావరి సమీపంలో జిల్లా స్థాయిలో గోదాముల నిర్మాణంతోపాటు మార్కెట్ యార్డు, మార్కెట్ కమిటీ కార్యాలయ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. గ్రేడ్–1గా ఉన్న మార్కెట్ యార్డు స్థల సేకరణ విషయంలో ఐదేళ్లుగా ముందడుగు పడడం లేదు. అన్ని విధాలుగా ఉపయోగపడే యార్డు ఏర్పాటులో తాత్సారంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుడిపేట శివారులో ఎంపిక చేసిన స్థలంపై అప్పటి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, జిల్లా కలెక్టర్ ద్వారా గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పలు కారణాలతో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రత్యేక దృష్టి సారించి మార్కెట్ కమిటీకి అనువైన స్థలాన్ని సేకరించి రైతులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. స్పెషల్ కార్యదర్శి హోదాతో కూడిన మార్కెట్ కమిటీని మరో మార్కెట్ యార్డులో విలీనం చేస్తే ఈ ప్రాంత రైతులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.