
కొత్త రేషన్‌కార్డులకూ బియ్యం
దండేపల్లి: జిల్లాలో కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారికి వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది. మూడు నెలలుగా ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ, కార్డుల్లో పేర్ల చేర్పులు కార్యక్రమం చేపట్టింది. జిల్లాలో 423 రేషన్ దుకాణాలు ఉండగా.. 2,20,055 మంది కార్డుదారులు ఉన్నారు. ఆగస్టు 15లోపు కొత్తగా 24,543మంది రేషన్‌కార్డులు పొందారు. వీరితోపాటు ఉన్న కార్డుల్లో 54,180మంది సభ్యులు చేరారు. పాతవారితోపాటు కొత్తకార్డుదారులకూ సెప్టెంబర్‌లో బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
పెరగనున్న కోటా..
గోదాముల్లో ఉన్న బియ్యం నిల్వలకు తోడు అదనంగా కావాల్సిన బియ్యం సరఫరా జరుగుతోంది. జనవరి నుంచి కొత్తకార్డుల జారీ, సభ్యుల పేర్లు చేర్పులు ప్రారంభమైనప్పటికీ జూన్ నెల తర్వాత కొత్తకార్డుల పంపిణీ జరిగింది. దీంతో కొత్త కార్డుదారులు, చేరిన సభ్యులు మూడు నెలల బియ్యాన్ని పొందలేక పోయారు. ఈ వ్యవధిలో పెరిగిన కార్డులకు అనుగుణంగా బియ్యం కోటా పెంచనున్నారు. కొత్త కార్డుల పంపిణీకి ముందు జిల్లాలోని రేషన్ దుకాణాలకు 4,352 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసేవారు. పెరిగిన లబ్ధిదారులకు అనుగుణంగా 4,693 మెట్రిక్ టన్నులు కేటాయించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు తెలిపారు. ఆగస్టు 15తర్వాత కార్డులు పొందిన వారికి అక్టోబర్‌లో పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.