
ఎట్టకేలకు ఓసీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీ(ఓసీసీ) కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ఎట్టకేలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డెప్యూటీ లేబర్ కమిషనర్(డీసీఎల్) యాదయ్య శనివారం సాయంత్రం ప్రకటించారు. 29న ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు కార్మిక శాఖ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు లేఖలు పంపించడంతోపాటు సాయంత్రం 5.30గంటలకు గేట్‌మీటింగ్‌లకు యూనియన్ల వారీగా సమయం కేటాయించారు. ప్రధానంగా రెండు యూనియన్ల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయి. ఐదు యూనియ న్లు పోటీకి అర్హత సాధించడం, ఎవరూ ఉపసంహరించుకోకపోవడం వల్ల అందరికీ ఎన్నికల గుర్తులు కేటాయించారు. 23న ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, 24న తెలంగాణ ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్, 25న ఓరియంట్ సిమెంట్ పర్మినెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్, 26న లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయిమెంట్ వర్కర్స్ యూనియన్, 27న ఓరియంట్ సిమెంట్ కార్మిక సంఘాలు గేట్‌మీటింగ్‌లు నిర్వహించుకోవడానికి సమయం కేటాయించారు. 29న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఎట్టకేలకు కార్మిక శాఖ నుంచి ఆదేశాలు రావడంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.