
బసవన్నల పండుగ.. ‘పొలాల’
కెరమెరి(ఆసిఫాబాద్): వ్యవసాయ పనులతో ఆలసిపోయిన బసవన్నలను పూజించే పండుగ పొలాల అమవాస్య. ఎడ్ల పండుగగా ప్రసిద్ధి చెందిన పొ లాలను శ్రావణమాసం చివరలో జరుపుకొంటారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే రైతులు తమకు సాగులో తోడునీడగా నిలిచే ఎడ్లను శుభ్రంగా కడిగి ముస్తాబు చేస్తారు. కొమ్ములకు రంగులు వేసి వీపుపై బొమ్మలు వేస్తారు. వీపుపై జూ లు, మేడలో గంటలు వేసి అలంకరిస్తారు. పండుగ సందర్భంగా సాయంత్రం ఎద్దులతో రైతులు స్థాని క ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయనున్నారు. గ్రామాల పటేళ్లు తోరణం తెంపిన తర్వాత ఎడ్ల జతలతో గ్రామాల్లోకి వెళ్తారు.
ఎడ్లకు ప్రత్యేక నైవేద్యం
ఎడ్లతో రైతుల అనుబంధాన్ని పొలాల పండుగ చాటుతుంది. ఇది పురాతన ఆచారంగా పెద్దలు చెబుతుంటారు. ఆలయాల్లో ప్రదక్షిణల అనంతరం ఎడ్లకు ప్రత్యేకంగా చేసిన వంటకాలను నైవేద్యంగా తినిపిస్తారు. ఎడ్లు లేని రైతులు కూడా తోటి రైతుల ఇళ్లకు వెళ్లి ఎద్దులకు పూజలు చేస్తారు.
సంబురాల ‘బడ్గా’
పొలాల అమావాస్య మరుసటి రోజు బడ్గా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ మాసంలో నెలరోజులపాటు ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు. పొలాల పండుగ జరుపుకొన్న మరుసటి రోజు బడ్గా సందర్భంగా మాంసాహారం తింటారు. అయితే ఉమ్మడి జిల్లాలో శనివారంతోపాటు ఆదివారం కూడా సంబురంగా బడ్గా జరుపుకోనున్నారు. గ్రామ పులిమేరల్లోని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. బడ్గా పండుగ తర్వాత గ్రామాల్లో ఈగలు, దోమల ఉధృతి తగ్గిపోతుందని గ్రామీణులు నమ్ముతారు.