ఢిల్లీలో తడోరా ఎయిర్‌ఫోర్స్‌ జవాన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో తడోరా ఎయిర్‌ఫోర్స్‌ జవాన్‌ మృతి

Aug 22 2025 3:16 AM | Updated on Aug 22 2025 3:16 AM

ఢిల్లీలో తడోరా ఎయిర్‌ఫోర్స్‌ జవాన్‌ మృతి

ఢిల్లీలో తడోరా ఎయిర్‌ఫోర్స్‌ జవాన్‌ మృతి

ముధోల్‌:ఢిల్లీలో ఎయిర్‌ఫోర్స్‌ జవాన్‌గా పనిచేస్తున్న ముధోల్‌ మండలం తరోడా గ్రామానికి చెందిన ఈశ్వరప్రసాద్‌(25) బుధవారం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శిలారం గంగాధర్‌ పెద్ద కొడుకు ఈశ్వరప్రసాద్‌ ఢిల్లీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సహోద్యోగులతో కలిసి ఆగ్రాలోని వాటర్‌ఫాల్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. తోటి ఉద్యోగులు ఆగ్రాలోని వైమానిక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీసులతో వాటర్‌ఫాల్‌ వద్ద గాలించగా, ఈశ్వరప్రసాద్‌ మృతదేహం లభ్యమైంది. దీంతో అక్కడి అధికారులు కుటుంబీకులకు సమాచారం అందిచారు. కుటుంబసభ్యులు ఎమ్మెల్యే రామారావు పటేల్‌ వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్‌, కేంద్రం హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని రప్పించేందుకు ఏర్పాటు చేశారు.

బస్టాండ్‌లో ఒకరి మృతి

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌లో గురువారం ఒకరు మృతి చెందారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడి వద్ద ఉన్న ఆధార్‌ కార్డు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉయ్యోర్‌కు చెందిన క్రిష్టోఫర్‌ (55)గా గుర్తించినట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు. మృతుడు ఆదిలాబాద్‌ పట్టణంలోని రాజస్థాన్‌ దాబాలో పనిచేస్తున్నట్లు వివరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహం రిమ్స్‌లోని మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు.

క్రెడిట్‌ కార్డుతో రూ.50వేలు మోసం

దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి క్రెడిట్‌ కార్డుతో రూ.50వేలు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దండేపల్లికి చెందిన వ్యక్తికి తాను లావాదేవీలు నిర్వహించే బ్యాంకు పేరుతో క్రెడిట్‌ కార్డు అవకాశం కల్పిస్తూ ఫోన్‌ చేశారు. ఓటీపీలు చెప్పాలని కోరడంతో చెప్పాడు. ఆ తర్వాత రెండ్రోజులకు ఇంటికే క్రెడిట్‌ కార్డు వచ్చింది. మళ్లీ ఫోన్‌ చేసి కార్డుపై ఉన్న నంబరు చెబితే ఆక్టివేట్‌ అవుతుందని చెప్పడంతో అలాగే చేశాడు. ఆదివారం మళ్లీ ఓసారి ఫోన్‌ చేసి ఓటీపీ నంబర్లు చెప్పాలని కోరడంతో చెప్పాడు. దీంతో రూ.33వేలు ఒకసారి, మరోసారి రూ.16వేలు కట్‌ అయినట్లు మెస్సేజ్‌లు వచ్చాయి. ఇటీవల కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వద్ద క్రెడిట్‌ కార్డు చెక్‌ చేయగా.. అందులో నుంచి రూ.50వేలు కట్‌ అయినట్లు తెలిసింది. దీంతో సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉట్నూర్‌రూరల్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఎండీ గౌస్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న హౌస్‌ వైరింగ్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియో గ్రాఫిక్స్‌, ఏసీ రిపేరింగ్‌, టూ వీలర్‌ మెకానిజం, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్‌, కుట్టు శిక్షణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, బస్సు చార్జీలు, ఒక జత యూనిఫాం, టూల్‌ కిట్స్‌, శిక్షణ అనంతరం కోర్సు ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిలైన 18–45 ఏళ్లవారు అర్హులని పేర్కొన్నారు. ఆధారకార్డు, తెల్లరేషన్‌ కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ ప్రతులు, నాలుగు ఫొటోలతో ఈ నెల 27న కేబీలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9949412159 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement