
జాతీయస్థాయి పుస్తక రచయిత శిక్షణకు గిరిజన యువతి
నార్నూర్: గాదిగూడ మండల కేంద్రానికి చెందిన ఆదివాసీ గిరిజన యువతి పెందూర్ దీపాలక్ష్మి ఆదివాసీ చరిత్రపై జాతీయస్థాయి పుస్తక రచయిత శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నెల 19నుంచి 25వరకు బెంగళూరులో నిర్వహించనున్న శిక్షణలో ఆమె పాల్గొంటున్నారు. గ్రామీణ పేదరిక నిర్మాణ సంఘం, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీ దివ్య ఆదేశాల మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఆధ్వర్యంలో ఆదివాసీ చరిత్రపై ఆరు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గాదిగూడ మండలం నుంచి అర్హత, అనుభవం, నాయకత్వ లక్షణాలు కలిగిన పెందూర్ దీపాలక్ష్మిని డీఆర్డీవో ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా దీపాలక్ష్మి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒక మెట్టు ఎదగాలంటే డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలం.. డబ్బు ఉంటేనే సక్సెస్ అవుతాం.. అనే ఆలోచనను పక్కనపెట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. జాతీయస్థాయి పుస్తకాల రచయిత శిక్షణకు తాను ఎంపిక కావడానికి పట్టుదల, స్వయం కృషే కారణమని తెలిపారు. ఈ పోటీకి ఎంపికావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో ఆదివాసీ చరిత్ర, ఆదివాసుల జీవన విధానం పుస్తకాలను ముందుకుతీసుకువస్తానని తెలిపారు. కాగా, జాతీయ పుస్తకాల రచయిత శిక్షణకు ఎంపికై న గిరిజన యువతిని చూసి ఆదివాసీ సమాజం గర్వపడుతోందని రాయిసెంటర్ జిల్లా సార్ మేడి మెస్రం దుర్గు పేర్కొన్నారు.