భోరజ్‌ అక్రమాలకు ‘చెక్‌’! | - | Sakshi
Sakshi News home page

భోరజ్‌ అక్రమాలకు ‘చెక్‌’!

Aug 7 2025 9:38 AM | Updated on Aug 7 2025 9:38 AM

భోరజ్‌ అక్రమాలకు ‘చెక్‌’!

భోరజ్‌ అక్రమాలకు ‘చెక్‌’!

● అంతర్రాష్ట చెక్‌పోస్టుల ఎత్తివేతకు రంగం సిద్ధం ● అవినీతి, ఆరోపణల నేపథ్యంలో సర్కారు నిర్ణయం

కొరవడనున్న నిఘా..

భోరజ్‌ చెక్‌పోస్టుపై అవినీతి, ఆరోపణలను పక్కనబెడితే దీనిని తొలగిస్తే నిఘా కొరవడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్‌ మీదుగా వెళ్లే వాహనాలకు పర్యవేక్షణ కరువవుతుంది. ప్రస్తుతం ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్లే వేలాది వాహనాలను 24 గంటల పాటు తనిఖీ చేస్తున్నారు. ఓవర్‌లోడ్‌, పత్రాలు లేకపోవడం, పర్మిట్లు, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నారు. చెక్‌పోస్టును ఎత్తివేస్తే వీటన్నింటిపై నిఘా కొరవడనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సైతం తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిబ్బందిని తనిఖీ అధికారులుగా నియమించినప్పటికీ 24 గంటల పాటు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టే అవకాశం కనిపించడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా ఆన్‌లైన్‌లోనే పర్మిట్లు, ఇతర పత్రాలను పరిశీలించనున్నారు. ఇందుకోసం వాహన సారధి యాప్‌ను అమలులోకి తీసుకొస్తారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. చెక్‌పోస్టు ఎత్తివేత విషయమై మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో చెక్‌పోస్టు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల కావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

సాత్నాల: భోరజ్‌ సమీకృత చెక్‌పోస్టు ఎత్తివేతకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను తొలగించేందుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు షురూ చేసింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ చెక్‌పోస్టులపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో పాటు ఏసీబీ తనిఖీల సమయంలో పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలు, లెక్కపత్రాలు అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. ప్రతీసారి తనిఖీ చేసిన సమయంలో వేలల్లో పట్టుబడుతున్నాయి. అయితే ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని అధికారులు చేతులెత్తేయడం, అనంతరం అక్రమ దందా యథాతథంగా సాగుతుండం ఇక్కడ షరా మామూలే. గతంలో డ్యూటీ, డబ్బుల విషయంలో గొడవలు జరగగా, ఆ పంచాయితీ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చెక్‌పోస్టులను ఎత్తివేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. అయితే ఈ చెక్‌పోస్టును ఎత్తివేస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా కొరవడే అవకాశం లేకపోలేదు. ఆన్‌లైన్‌లోనే ఫిట్‌నెస్‌, ఇతర పర్మిట్‌లను జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం వాహన సారధి అనే యాప్‌ను అనుసంధానం చేయనున్నట్లు చెబుతున్నారు.

అక్రమాలకు అడ్డా..

భోరజ్‌ చెక్‌పోస్టు అనేక అక్రమాలకు అడ్డాగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది వాహనాలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయి. ఓవర్‌లోడ్‌, పర్మిట్‌ లేకపోవడం, ఫిట్‌నెస్‌ సమస్య, డ్రైవర్లకు లైసెన్సు తదితర అనేక అంశాలపై వాహనాలను ఇక్కడ తనిఖీ చేస్తుంటారు. ఈ చెక్‌పోస్టు 24 గంటల పాటు కొనసాగుతుంది. అయితే ఇందులో నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు, అటెండర్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కంప్యూటర్‌ ఆపరేటర్లు మొత్తం 20 మంది వరకు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇందుకోసం చెక్‌పోస్టులో ఓ డబ్బాను సైతం ఏర్పాటు చేశారని, వసూళ్ల కోసం ప్రైవేట్‌ వ్యక్తులను కూడా నియమించుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యక్తుల వద్దనే డబ్బులు జమచేసి అధికారులు వాటా తీసుకుంటారని ప్రచారం ఉంది. నిబంధనల ప్రకారం.. వాహనదారులు చెల్లించే డబ్బులు తక్కువగా ఉంటాయి. అయితే ఏసీబీ తనిఖీల సమయంలో లెక్కకు తేలని వేలాది రూపాయలు ఉండటం అంతుచిక్కని విషయం. గతేడాది డిసెంబర్‌ 4న భోరజ్‌ చెక్‌పోస్టును ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సమయంలో లెక్కకురాని రూ.62,500 నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. లెక్కకురాని డబ్బులను పైస్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు వాటాలు పంచుకుంటారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులకు ఏరోజుకారోజు డబ్బులు చెల్లిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చెక్‌పోస్టును తొలగించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

భోరజ్‌ చెక్‌పోస్టు (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement