● ఉద్యోగుల నుంచి ఉపాధి కూలీల వరకు ● ఫేస్‌రికగ్నిషన్‌తోనే విధులకు హాజరు నమోదు ● ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈకేవైసీ మొదలు ● ఈ నెల 15నుంచి పకడ్బందీగా అమలుకు ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/పాతమంచిర్యాల: ప్రభుత్వం ప్రజలకు మరింత పకడ్బందీగా సేవలు అందించేలా సాంకేతికతను అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా తదితర కార్యక్రమాల్లో బయోమెట్రిక్, జియో ట్యాగింగ్‌తో కూడిన హాజరు అమలు చేస్తోంది. ఉద్యోగుల ముఖం చూపిస్తేనే హాజరును ప్రామాణికంగా తీసుకుంటోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు అమలవుతోంది. ఇటీవలే విద్యాశాఖలో సర్కారు బడుల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ తప్పనిసరి చేసింది. ఫేస్ రికగ్నిషన్ పద్ధతిలోనే రోజువారీగా విధుల హాజరు, గైర్హాజరు పరిశీలనలు జరుగుతున్నాయి. ఉదయం పూట ఒకసారి, సాయంత్రం మరోసారి ఈ మేరకు ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు కచ్చితంగా ముఖ గుర్తింపు విధానంలో కార్యదర్శులు తప్పుగా ఫొటోలు నమోదు చేయడంతోనే సస్పెన్షన్‌కు గురయ్యారు. జిల్లాలోనూ 21మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమాధానాలు సంతృప్తికరంగా లేనిపక్షంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉపాధి హామీ పథకంలోనూ కూలీలకు ముఖ గుర్తింపు హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఇప్పటికే ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్‌ఎంఎంఎస్)’ హాజరు నమోదును ఫీల్డ్ అసిస్టెంట్లు అప్‌లోడ్ చేస్తుండగా.. ఇక నుంచి మరింత పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
నమోదైన కూలీలే హాజరయ్యేలా..
నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం సాఫ్ట్‌వేర్ యాప్ ద్వారా పనులు పారదర్శకంగా చేపట్టేలా కొత్త విధి విధానాలు రూపొందించారు. వీటి ప్రకారం పనులు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో చాలాచోట్ల జాబ్‌కార్డులు ఉన్న ఇంట్లో ఒకరి పేరు మీద జాబ్‌కార్డు ఉంటే వారి బదులు మరొకరు హాజరవుతున్నారు. దీంతో వేతనాల చెల్లింపుతోపాటు పని ప్రదేశంలో ఎవరికై నా ప్రమాదం జరిగితే పరిహారం చెల్లించడం సమస్యగా మారుతోంది. దీంతో బాధిత కుటుంబాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ క్రమంలో తప్పనిసరిగా జాబ్‌కార్డు ఉండి పనికి హాజరైన కూలీల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తూ ఈకేవైసీ చేస్తున్నారు. దీంతో పనికి హాజరైన కూలీ ఫొటో తీయగానే ఆధార్ నమోదై ఉన్న బయోమెట్రిక్ కారణంగా ఎవరు హాజరయ్యారో సులువుగా తెలిసిపోతుంది. రోజుకు రెండుసార్లు ఉదయం పని మొదలయ్యాక ఒకసారి, నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసుకుంటారు. ఫొటోలో ఉన్న కూలీలే హాజరైతే మస్టర్ పడుతుంది. ఫొటోల్లో తేడాలు ఉంటే మస్టర్ నమోదు కాదు. ఒక ఫొటోకు మరో ఫొటోకు తప్పనిసరిగా నాలుగు గంటల వ్యత్యాసం ఉండాలి. నమోదైన కూలీలే హాజరై పని చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. వీటితోపాటు జియోట్యాగింగ్ ప్రదేశంలో జియో ఫెన్సింగ్ అప్డేట్ చేస్తూ పని ప్రదేశాలను సైతం గుర్తించే వీలు కలుగనుంది. పాత చోట్ల మళ్లీ పనులు చేయకుండా చర్యలు తీసుకోనుంది. సిగ్నల్‌లేని, సాంకేతిక సమస్యలు ఉన్నా జిల్లా కోఆర్డినేటర్‌తో పరిష్కరించనున్నారు. కాగా, ఈ అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన కల్పించారు. ఎన్‌ఎంఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా పనులు, కూలీల నమోదుపై వివరించారు. ఈ నెల 15నుంచి ఫేస్ రికగ్నిషన్ విధానం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
పనుల్లో పారదర్శకత
ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పెంచడానికే కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కూలీ లు పని స్థలాల్లో పని చేస్తేనే కూలి చెల్లింపులు జరుగుతాయి. జాబ్‌కార్డు కలిగిన కూలీలే పనులకు హాజరు కావాలి. వారికే వేతనం లభిస్తుంది. కొత్త సాఫ్ట్‌వేర్‌తో పనుల్లో జరిగే అక్రమాలను నియంత్రించవచ్చు.
– ఎస్.కిషన్,
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
అన్నింటికీ ముఖమే!
అన్నింటికీ ముఖమే!